ప్రధాని నరేంద్ర మోదీ.. ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. వ్యవసాయం, పర్యాటక, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన తదితర కార్యక్రమాలను ఆయన వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ విషయాలను మోదీ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
"వారణాసి పట్టణాభివృద్ధికి సంబంధించి కీలకమైన ఘట్టం సోమవారం ఆవిష్కృతం కానుంది. సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చాలా ప్రాజెక్టులను ప్రారంభించనున్నాను. వీటిలో వ్యవసాయం, పర్యాటకం, మౌలిక వసతులకు చెందిన అభివృద్ధి పనులు ఉన్నాయి".
--ప్రధాని మోదీ
ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టులకు సంబంధించిన అర్హులతోనూ ప్రధాని ముచ్చటిస్తారని తెలిపింది ప్రధానమంత్రి కార్యాలయం.
ప్రాజెక్టులు ఇవే
సార్నాథ్ లైట్ అండ్ సౌండ్ ప్రదర్శనశాల, రామ్‌నగర్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రి పునరుద్ధరణ, నగరంలో డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన ప్రాజెక్టులు, విత్తనాల స్టోరేజీ కేంద్రం, సంపూర్ణానంద్ స్టేడియం శంకుస్థాపన, 105 అంగన్వాడీ కేంద్రాలు, 102 గోవు సంరక్షణ కేంద్రాలు, పలు ఘాట్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు.