ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్రాంతి లేకుండా పర్యటించనున్నారు. సోమ, మంగళ వారాల్లో వరుస పర్యటనలతో బిజీగా గడపనున్నారు. 36 గంటల్లో 5,300 కిలో మీటర్లు ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. రెండు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 7 నగరాల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను శనివారం అధికారులు వెల్లడించారు.
ప్రధాని మోదీ ఏప్రిల్ 24న ఉదయం దిల్లీ నుంచి బయలుదేరి మధ్యప్రదేశ్ వెళ్లనున్నారు. అక్కడి నుంచి కేరళ చేరుకుంటారు. ఆ తర్వాత కేంద్ర పాలిత ప్రాంతమైన దమన్ దీవ్ - దాద్రా నగర్ హవేలీలో పర్యటిస్తారు. అనంతరం తిరిగి ఏప్రిల్ 25న దిల్లీ చేరుకుంటారు. అనంతరం దిల్లీకి 500 కిలో మీటర్ల దూరంలో ఉన్న మధ్యప్రదేశ్‌లోని ఖజురహోకు చేరుకుంటారు. అక్కడి నుంచి రేవా వెళ్లి.. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి ఖజురహో చేరుకుంటారు.
అనంతరం ఖజురహో నుంచి 1,700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొచ్చి వెళ్తారు ప్రధాని మోదీ. అక్కడ జరిగే యువమ్ సదస్సులో పాల్గొంటారు. ఆ తర్వాత ఏప్రిల్ 25 మంగళవారం ఉదయం కొచ్చి నుంచి 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న తిరువనంతపురం చేరుకోనున్నారు. అక్కడ కేరళలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. దాంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కేరళ పర్యటన అనంతరం.. 1,570 కిలో మీటర్ల దూరంలో ఉన్న సిల్వస్సా (దమన్ దీవ్) చేరుకుంటారు. అక్కడ నమో మెడికల్ కాలేజీని సందర్శిస్తారు. దీంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి దమన్‌కు చేరుకుని.. అభివృద్ధి చేసిన డేవ్కా సీ ఫ్రంట్‌ను ప్రారంభించనున్నారు. ఈ పర్యటన ముగించుకుని కర్ణాటకలోని సూరత్ మీదుగా తిరిగి దిల్లీ చేరుకోనున్నారు.
ప్రధాని సుడిగాలి పర్యటన దూరం.. భారతదేశం పొడవు కన్నా ఎక్కువ!
సుడిగాలి పర్యటన షెడ్యూల్‌లో.. ప్రధాని మోదీ దాదాపు 5,300 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు. అయితే, ఉత్తరం నుంచి దక్షిణం వరకు భారతదేశం పొడవు దాదాపు 3200 కిలోమీటర్లు ఉంటుంది. దీని కంటే ఎక్కువ దూరం ప్రధాని పర్యటించనున్నారు. ఇదే కాకుండా ఈ మొత్తం దూరాన్ని ఆయన 36 గంటల్లోనే పూర్తి చేయనుండటం విశేషం.