PM Modi Speech in Mahabubabad Public Meeting : మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ అని.. తెలంగాణలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలుగులో మాట్లాడిన ఆయన.. రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే నాశనం చేశాయని ఆరోపించారు. బీజేపీ మంత్రివర్గంలో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉంటుందన్న మోదీ.. గతంలో కేసీఆర్ దిల్లీకి వచ్చి భారతీయ జనతా పార్టీతో కలుస్తామని అడిగారని చెప్పారు. తన వారసుడిని సీఎంగా చేస్తే.. తమ పార్టీతో కలుస్తామని కేసీఆర్ అడిగారన్నారు. కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించడంతో బీజేపీని తిట్టడం మొదలుపెట్టారని తెలిపారు.
"గతంలో కేసీఆర్ దిల్లీకి వచ్చి బీజేపీతో కలుస్తామని అడిగారు. తన వారసుడిని సీఎంగా చేస్తే.. భారతీయ జనతా పార్టీతో కలుస్తామని చెప్పారు. కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించడంతో మా పార్టీని తిట్టడం మొదలుపెట్టారు." - ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నిజామాబాద్‌ను పసుపు నగరంగా ప్రకటిస్తాం : నరేంద్ర మోదీ
BJP Public Meeting in Mahabubabad : ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అంధ విశ్వాసాలపై నమ్మకం ఎక్కువ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంధ విశ్వాసాలను నమ్మి.. సచివాలయాన్ని కూల్చారని ఆరోపించారు. కేసీఆర్ తన మూఢ నమ్మకాలతో ప్రజాధనం వృథా చేశారని మండిపడ్డారు. మూఢ నమ్మకాలకు బానిస అయిన ఈ ముఖ్యమంత్రి మనకు అవసరమా అని ప్రశ్నించారు. మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ.. ఈ మేరకు అధికార బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా ఫామ్‌హౌజ్ నుంచి బయటకు రాని ఈ సీఎం మనకు అవసరమా అని కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రజలను ప్రశ్నించారు. బీఆర్ఎస్ అవినీతిపరులను జైలుకు పంపిస్తామని సంకల్పం తీసుకున్నామని చెప్పారు. సాగు నీటి ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపేది తెలంగాణ బీజేపీ సర్కార్ అని పేర్కొన్నారు. రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేసిన వారిని జైలుకు పంపేది తమ ప్రభుత్వమే అని మోదీ స్పష్టం చేశారు.
ప్రజలను కలవని సీఎం, సచివాలయానికి రాని సీఎం మనకు అవసరమా? : మోదీ
"బీఆర్ఎస్ అధినేతకు అంధ విశ్వాసాలపై నమ్మకం ఎక్కువ. అంధ విశ్వాసాలను నమ్మి సచివాలయాన్ని కూల్చారు. కేసీఆర్ తన మూఢ నమ్మకాలతో ప్రజాధనం వృథా చేశారు. మూఢ నమ్మకాలకు బానిస అయిన ఈ సీఎం మనకు అవసరమా? ఫామ్‌హౌజ్ నుంచి బయటకు రాని ఈ సీఎం మనకెందుకు?" - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
గెలిచే అవకాశాలున్న స్థానాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ - జాతీయ నాయకుల రోడ్ షోలు, సభలతో బిజీబిజీ