PM Modi in Gujarat: స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో భద్రతాపరమైన సంస్కరణలేవీ ప్రవేశపెట్టలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. అవసరం ఉన్నప్పటికీ.. ఈ దిశగా చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. గుజరాత్ గాంధీనగర్‌లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన.. భద్రతా దళాలకు అన్నిరకాలుగా శిక్షణ అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సాధారణ ప్రజల్లో పోలీసుల పట్ల సదాభిప్రాయం లేదని.. దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.


రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ(ఆర్ఆర్యూ)పై ఎన్నో అంచనాలు ఉన్నాయని మోదీ అన్నారు. యూనివర్సిటీలు, కళాశాలలు అభివృద్ధిలో విశేషంగా ఉపయోగపడతాయని చెప్పారు. 60ఏళ్ల క్రితం అహ్మదాబాద్‌లో ఓ వ్యాపారి ప్రారంభించిన ఫార్మసీ.. గుజరాత్‌ను ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దిందని చెప్పుకొచ్చారు. అదేసమయంలో ఏర్పాటైన ఐఐఎం ఇప్పుడు ప్రపంచస్థాయి వ్యాపారవేత్తలను తయారుచేస్తోందన్నారు. అదేవిధంగా ఆర్ఆర్యూ సైతం రక్షణ రంగంలో దిగ్గజ లీడర్లను తయారుచేయాలని ఆకాంక్షించారు.

రోడ్‌షో..
అంతకుముందు, గాంధీనగర్ దహేగామ్‌లో రోడ్ షో నిర్వహించారు మోదీ. అసెంబ్లీ ఎన్నికల్లో విజయోత్సాహంతో నిర్వహించిన ఈ రోడ్ షోకు జనం భారీగా తరలివచ్చారు. రోడ్డుకు ఇరువైపుల హాజరైన ప్రజలకు అభివాదం చేసుకుంటూ రక్షా శక్తి వర్సిటీకి వెళ్లిన ప్రధాని.. రాష్ట్రీయ రక్షా వర్సిటీ నూతన భవనాన్ని జాతికి అంకితం చేశారు.


ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్ర హోమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'అభివృద్ధికే వారి ఓటు- అందుకే భాజపాకు అధికారం'