కరోనా నియంత్రణ, టీకా పంపిణీ వ్యూహాలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ సమీక్ష నిర్వహించారు. దృశ్యమాధ్యమం ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న 8 రాష్ట్రాల సీఎంలతో మొదటగా ప్రధాని చర్చించారు.
ఈ భేటీలో కేంద్రమంత్రులు అమిత్ షా, హర్షవర్దన్ పాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. దేశంలో పాజిటివిటీ రేటు 5 శాతానికి, మరణాల రేటు 1 శాతానికి తగ్గేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా టీకా పంపిణీకి అవసరమైన సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు.
"టీకా అందుబాటులోకి వచ్చిన వెంటెనే పంపిణీకి సిద్ధంగా ఉండాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి. రాష్ట్రాల్లోని శీతల గిడ్డంగుల సమాచారాన్ని త్వరగా సేకరించాలి. వ్యాక్సిన్‌పై వచ్చే దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలి.
ప్రస్తుతం అందరి ఉమ్మడి కృషి వల్ల ఇవాళ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. రికవరీ, మరణాల రేటులో చాలా దేశాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాం. ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. పీఎం కేర్స్ నిధులను ఆక్సిజన్, వెంటిలేటర్ల తయారీకి ఉపయోగిస్తాం."
- ప్రధాని నరేంద్రమోదీ
సురక్షితమైన టీకా...
ఔషధాలు కొందరిపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని.. అందువల్ల శాస్త్రీయ ప్రాతిపదికన సురక్షితమైన టీకానే ప్రజలకు అందిస్తామని మోదీ స్పష్టం చేశారు.
"వ్యాక్సిన్ విషయంలో భారత్‌కు ఉన్న అనుభవం ఏ దేశానికి లేదు. టీకాకు సంబంధించి వేగం ఎంత ముఖ్యమో.. భద్రత కూడా అంతే ముఖ్యం. శాస్త్రీయ ప్రమాణాల ప్రకారం సురక్షితమైన టీకానే పౌరులకు అందిస్తాం. ఇప్పటివరకు ఏ టీకా ఎంత ధరలో లభిస్తుందన్న విషయం నిర్ణయించలేదు. భారత్ అభివృద్ధి చేస్తోన్న రెండు వ్యాక్సిన్లు ముందంజలో ఉన్నాయి. వీటితోపాటు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
తగిన చర్యలు తీసుకుంటున్నాం..
కరోనాపై పోరులో బంగాల్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని సీఎం మమతా బెనర్జీ ప్రధానికి వివరించారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. రికవరీ రేటు పెరుగుతోందని, కొత్త కేసులు తగ్గాయని చెప్పారు. ఇదే వేదికగా.. జీఎస్టీ బకాయిల విషయాన్ని దీదీ ప్రస్తావించారు.
కాలుష్యమే ప్రధానం..
దిల్లీలో మూడో దశ కరోనా వ్యాప్తికి చాలా కారణాలున్నా.. కాలుష్యమే ప్రధానంగా ప్రభావం చూపుతోందని సీఎం అరవింద్ కేజ్రివాల్ అన్నారు. దిల్లీ సరిహద్దు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేయడం వల్లే కాలుష్యం పెరుగుతోందని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని మోదీని కోరారు.
దిల్లీలో క్రమంగా కేసుల తీవ్రత తగ్గుతోందన్నారు కేజ్రీవాల్. కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులకు మరో 1,000 ఐసీయూ పడకలు అందివ్వాలని కేజ్రీవాల్ కోరారు.
ప్రత్యేక టాస్క్‌ఫోర్స్..
రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీకి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. సీరమ్ అధినేత అదర్ పూనావాలాతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలను ప్రధానికి వివరించారు.
ఇదీ చూడండి: తొలిదశలో కోటి మంది ఆరోగ్య సిబ్బందికి టీకా!