శ్రీలంకలోని తమిళులకు సమానత్వం, న్యాయం, శాంతి, గౌరవం దక్కే విధంగా కృషి చేసేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తమిళుల హక్కులపై శ్రీలంకతో రాజ్యాంగబద్ధంగా చర్చిస్తున్నట్టు వెల్లడించారు. అదే సమయంలో తమ ప్రభుత్వ కృషి కారణంగా.. శ్రీలంక కస్టడీలో ఒక్క భారతీయ మత్స్యకారుడు కూడా లేడని.. 313 పడవలనూ ఆ దేశ ప్రభుత్వం విడిచిపెట్టిందని పేర్కొన్నారు.
తమిళనాడులో పర్యటించిన ప్రధాని.. చెన్నై నెహ్రూ స్టేడియం వేదికగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చూట్టారు. ప్రపంచ దేశాల చూపు భారత్‌వైపు ఉందని.. ఈ దశాబ్దం భారతీయులదేనని పేర్కొన్నారు. వారి శ్రమే ఇందుకు కారణమవుతుందన్నారు.
నీటి సంరక్షణ ఆవశ్యకతను గుర్తుచేశారు మోదీ. ఈ క్రమంలో తమిళనాడు రైతులపై ప్రశంసల వర్షం కురిపించారు. నీటి వనరులను సరిగ్గా వినియోగించుకుని.. రికార్డుస్థాయిలో ఆహారధాన్యాలను ఉత్పత్తి చేశారని కొనియాడారు.
అమరవీరులకు నివాళి...
పుల్వామా ఉగ్రదాడికి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో అమరవీరులకు నివాళులర్పించారు మోదీ. దేశ భద్రతా దళాలపై తమకెంతో గౌరవం ఉందన్నారు. భవిష్యత్తు తరాలకు.. అమరవీరుల ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు.
"ఈ రోజును ఏ భారతీయుడూ మరచిపోలేడు. రెండేళ్ల క్రితం, ఈ రోజున పుల్వామా దాడి జరిగింది. అమరవీరులకు నివాళులు. మన భద్రతా దళాల ధైర్యసాహసాలు చూసి గర్వంగా ఉంది. వారు ఎందరికో స్ఫూర్తిదాయకం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
అభివృద్ధి పనులకు శ్రీకారం...
పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మోదీ. ఇటీవలే విస్తరించిన చెన్నై మెట్రో లైను సహా చెన్నై బీచ్-అత్తిపట్టు మధ్య ఏర్పాటు చేసిన రైల్వే లైనును ప్రారంభించారు.
అనంతరం ఐఐటీ మద్రాస్‌లోని డిస్కవరీ క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు మోదీ. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఎమ్కే-1ఏ(అర్జున్ మైన్ యుద్ధ ట్యాంకర్)ను సైన్యాధిపతి ఎమ్ఎమ్ నరవణేకు అందించారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పాల్గొన్నారు.
ఇదీ చూడండి:- 48 అడుగుల కేక్‌తో బేకరీ 'రామ సందేశం'