మంత్రివర్గ విస్తరణ(Cabinet Expansion) ప్రధానమంత్రి విచక్షణాధికారం! ఆ విచక్షణను బుధవారంనాడు దాదాపు పూర్తిస్థాయిలో ప్రదర్శించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ! అనూహ్యంగా 12 మంది మంత్రులపై.. అదీ రవిశంకర్‌ప్రసాద్, హర్షవర్ధన్, ప్రకాశ్ జావడేకర్‌లాంటి సీనియర్‌నేతలపైనా వేటు, ఓబీసీలకు పెద్దపీటలాంటి నిర్ణయాలు భాజపాలోనూ చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇంతకూ ప్రధాని మోదీ తన మంత్రివర్గ విస్తరణతో ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు? ఈ మార్పులతో ఆయనేం ఆశిస్తున్నారేది ఆసక్తికరాంశంగా మారింది!
రాజకీయంగా సరికొత్త ముద్ర..
వరుసగా రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చినా.. వివిధ రాష్ట్రాల్లో గెలుస్తున్నా.. ఇప్పటిదాకా భాజపాపై అగ్రవర్ణముద్ర పోలేదు. తొలిసారిగా కేంద్రమంత్రివర్గంలో మోదీ 30శాతం మంది ఓబీసీలకు చోటు కల్పించారు. ఎస్సీ, ఎస్టీలను కలుపుకొంటే.. 50శాతంపైగా (ఓబీసీలు 27, దళితులు 12, ఆదివాసీలు 8, మహిళలు 11) ఈ వర్గాల నుంచి ప్రాతినిధ్యం లభించింది. ఇది భాజపాలో కొత్త సామాజిక విధానపరమైన మార్పుగా అభివర్ణిస్తున్నారు. తద్వారా పార్టీ అన్ని వర్గాలకు దగ్గరయ్యేందుకు దోహదం చేస్తుందని భావన. వచ్చే ఏడాది రాబోయే ఉత్తర్‌ప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో, ఇటీవలే గణనీయంగా సీట్లు సాధించిన బెంగాల్‌లో పట్టు పెంచుకునేందుకు ఈ సమీకరణాలు ఉపయోగపడతాయని భాజపా భావిస్తోంది. యూపీ, బిహార్‌లాంటి చోట్ల ఓబీసీల ఓట్లు చాలా కీలకం!
పాలనపై పట్టుకు..
రెండో దఫా అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా నరేంద్రమోదీ పాలనతీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. కొవిడ్ సందర్భంలో వివిధ శాఖల మధ్య సమన్వయలోపంపై పార్టీలోనూ అంతర్గతంగా అసంతృప్తి ఉంది. గతంలో సీనియర్ నేతలనే పేరుతో చాలామందికి కీలకమైన శాఖలిచ్చారు. కానీ వారి పనితీరు సరిగ్గా లేకపోవటం; పదేపదే ఆ శాఖల్లో వివాదాలు, ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారటం వల్ల పాలనకు కొత్త రూపునివ్వాలని మోదీ భావించినట్లు కన్పిస్తోంది. అందుకే.. సమర్థంగా పనిచేయటం లేదని భావించిన హర్షవర్ధన్, రవిశంకర్, పోఖ్రియాల్‌లాంటి సీనియర్లను సైతం పక్కనబెట్టారు. సైకిల్‌పై పార్లమెంటుకు వస్తారని ప్రచారంలోకి వచ్చిన సారంగిని సైతం పంపించేశారు. కొవిడ్ విషయంలో ఆరోగ్యశాఖ మంత్రి పనితీరుపై ఇంటాబయటా విమర్శలు వ్యక్తమయ్యాయి. పని చేయకుంటే.. సీనియర్లైనా వేటే అనే సందేశం స్పష్టంగా ఇచ్చారు. యువతరానికి, విద్యాధికులకు, మాజీ బ్యూరోక్రాట్లకు, మహిళలకు పెద్దపీట వేస్తూ తన కేబినెట్ రూపు మార్చారు. 36 మంది కొత్తవారిలో చాలామందికి సహాయ మంత్రి పదవులిచ్చి.. కేబినెట్‌లోకి మాత్రం అనుభవజ్ఞులను, మాజీ ఐఏఎస్‌లను, మాజీ ముఖ్యమంత్రులను తీసుకున్నారు. ఎలాంటి పాలనానుభవం లేకుండా కేబినెట్‌లోకి వచ్చింది ఒక్క భూపేందర్ యాదవ్ మాత్రమే. అంతేగాకుండా.. ఇబ్బందులు లేకుండా ఉండేలా శాఖల కూర్పులో సైతం మార్పులు తెస్తున్నారు. మొత్తానికి 2024 ఎన్నికల నాటికి పాలనపరంగా సమర్థంగా పేరు తెచ్చుకోవాలనేది లక్ష్యంగా కనిపిస్తోంది.
కొత్త నాయకత్వానికి బాటలు..
వారసత్వానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకున్నా కొత్త నాయకులను తయారు చేయటం లేదన్నది భాజపాలో అంతర్గతంగా ఉన్న విమర్శ! ఇప్పుడా విమర్శకు చెక్ పెడుతున్నారా అన్నట్లు.. యువతరానికి, కొత్తవారికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో.. పాతతరం సీనియర్లు అనుకున్నవారిని సైతం పక్కనబెట్టడానికి వెనుకాడలేదు. ముఖ్యంగా హర్షవర్ధన్, రవిశంకర్ ప్రసాద్‌లాంటివారిని! వాజపేయీ హయాం నుంచి ప్రస్తుతం కేబినెట్‌లో సాగుతున్న వారిలో రాజ్‌నాథ్ ఒక్కరే ప్రముఖులుగా కనిపిస్తున్నారు.
మిత్రపక్షాలకు చోటు..
మిత్రపక్షాలకు ఎన్డీయే సరైన స్థానం ఇవ్వటం లేదన్న అపప్రథను తొలగించుకునే ప్రయత్నం ఈ విస్తరణ ద్వారా చేశారు. అలాగని ఒత్తిళ్లకు లొంగేది లేదని.. తామనుకున్నవారికే, తామనుకున్నన్ని బెర్తులే ఇస్తామని చెప్పకనే చెప్పారు. నాలుగు సీట్లు కావాలని పట్టుబడుతున్న నీతీశ్‌కుమార్ పార్టీ జనతాదళ్ (యు)కు ఈసారి కూడా నిరాశే మిగలటం ఇందుకు నిదర్శనం. చివరకు ఒక బెర్తుతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఎల్జేపీలో తామనుకున్నది చేసిన పశుపతి పారస్ (రాంవిలాస్ పాసవాన్ సోదరుడు)కు మంత్రిపదవిని కట్టబెట్టారు. అలాగే.. ఉత్తరప్రదేశ్‌లో కుర్మీ ఓట్లపై కన్నేసి అప్నాదళ్ ఎంపీ అనుప్రియకు మంత్రి మండలిలో చోటిచ్చారు.
మొత్తానికి.. ఉత్తర్‌ప్రదేశ్ సహా వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై కన్నేయటం సహా ఈ రెండేళ్లలో వివిధ కారణాలతో మూటగట్టుకున్న అసంతృప్తిని, అపప్రథను తొలగించుకోవటం; 2024 సార్వత్రిక ఎన్నికలనాటికి సరికొత్త రూపురేఖలతో పార్టీపరంగా, పాలనా పరంగా పూర్తిగా సిద్ధం కావాలనేది ఈ విస్తరణ లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తోంది!
నోరు జారొద్దు.. దూరం పెట్టొద్దు
మీడియాపై కొత్త మంత్రులకు ప్రధాని మోదీ సూచన
'మీకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నాం.. చురుగ్గా వ్యవహరించండి. మీడియాను దూరం పెట్టవద్దు.. అదే సమయంలో మీడియా వద్ద నోరు జారవద్దు' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన మంత్రులకు సూచించారు. మంత్రివర్గంలో పదోన్నతి కల్పించనున్న ఏడుగురిని, సహాయ/ స్వతంత్ర మంత్రులు, నూతనంగా మంత్రులుగా చేర్చుకునే 36 మందిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం మధ్యాహ్నం తన నివాసానికి ఆహ్వానించారు. ఆ 43 మందితో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బి.ఎల్.సంతోష్ సమావేశమయ్యారు. మోదీ మాట్లాడుతూ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూనే అవి ఇబ్బందికరంగా ఉంటే తర్వాత చెబుతామంటూ సానుకూల ధోరణితో ఒప్పించాలని సూచించారు. శాఖలపై పట్టు సాధించాలని, ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడే ఆయా శాఖల బాధ్యతలు స్వీకరించాలని సూచించారు. పార్లమెంటు సమావేశాల్లో శాఖాపరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలన్నారు.
ఇదీ చూడండి: Cabinet Expansion: మోదీ కేబినెట్‌లో భారీ ప్రక్షాళన