బంగాల్లో భాజపా మాత్రమే నిజమైన పార్టీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర పథకాలు రాష్ట్రానికి రాకుండా మమతా బెనర్జీ అడ్డుగోడలా నిల్చున్నారని ధ్వజమెత్తారు. ఖరగ్‌పుర్‌లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్న ఆయన.. టీఎంసీ సర్కార్ ప్రజల ఆశయాల్ని వమ్ము చేసిందని మండిపడ్డారు. బంగాల్‌ను గత 70 ఏళ్లలో అన్ని పార్టీలు నాశనం చేశాయని అన్నారు. భాజపాకు అవకాశం ఇస్తే ఈ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతామని చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రాణత్యాగం చేసేందుకైనా సిద్ధమని తెలిపారు.
మమతా బెనర్జీ క్రూరత్వం అనే పాఠశాల నడిపిస్తున్నారని అన్నారు మోదీ. దోపిడీలు, సిండికేట్లు, నియంతృత్వం, నిధులు దోచుకోవడమే అక్కడ పాఠ్యాంశాలు అని ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం 'బుజ్జగింపుల ఆట' ఆడుతున్నారని విమర్శించారు.
"నిన్న వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సామాజిక మాధ్యమాలు 50-55 నిమిషాలు నిలిచిపోయాయి. అందరూ ఆందోళన చెందారు. కానీ 50-55 ఏళ్ల నుంచి బంగాల్లో అభివృద్ధి ఆగిపోయింది. తొలుత కాంగ్రెస్, తర్వాత వామపక్షాలు, ఇప్పుడు టీఎంసీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నాయి. ఈ మూడు పార్టీల విధ్వంసాన్ని మీరు చూశారు. టీఎంసీ మీ కలల్ని నాశనం చేసింది. గత 70 ఏళ్లలో మీరు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈసారి మాకు అవకాశం ఇవ్వండి. 70 ఏళ్ల నుంచి జరుగుతున్న వినాశనం నుంచి బంగాల్‌ను కాపాడతాం. మీకోసం మా ప్రాణాలను త్యాగం చేస్తాం."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
దేశం మొత్తం సింగిల్ విండో విధానం ద్వారా ముందుకెళ్తోందని.. బంగాల్లో 'మేనల్లుడు'(అభిషేక్ బెనర్జీని ఉద్దేశిస్తూ) అనే సింగిల్ విండో విధానం మాత్రమే ఉందని మోదీ ధ్వజమెత్తారు. ఏ పనైనా ఆయన్ను దాటకుండా జరగదని అన్నారు. టీఎంసీ సిండికేట్ల వల్ల పాత పరిశ్రమలు మూతపడ్డాయని.. మాఫియానే వెలుగొందుతోందని మండిపడ్డారు.
భాజపాను ఆశీర్వదించేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మోదీ. బంగాల్లో భాజపానే అధికారంలోకి వస్తుందనేందుకు ఇదో సూచన అని అన్నారు.
వీల్‌చైర్‌పై సర్కార్
మరోవైపు, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సైతం టీఎంసీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వీల్‌చైర్‌పై ఉందని, సొంతకాళ్లపై నిలబడలేని స్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. ఆట ఆరంభమైందని చెప్పినవారు ఇప్పుడు కాలు విరగ్గొట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఆట ప్రారంభం కాలేదని, ఇప్పుడే ముగిసిపోయిందని అన్నారు. వీల్చైర్లు, విరిగిన కాళ్లను చూపించి బంగాల్ ప్రజలను మోసం చేయలేరని విమర్శించారు.