Taj Mahal Controversy: తాజ్‌మహల్‌లో మూసి ఉన్న 22 గదుల్లో హిందూ దేవతా విగ్రహాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోందని.. ఆ గుట్టు తేల్చడానికి ఆ గదులను తెరిచేలా భారత పురావస్తు శాఖ అధికారులను ఆదేశించాలని అలహాబాద్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. తాజ్‌మహల్‌లో హిందూ విగ్రహాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో దానిపై నిజనిర్ధరణ కమిటీని ఏర్పాటు చేయాలని అలహాబాద్ హైకోర్టులోని లఖ్‌నవూ బెంచ్‌ను పిటిషనర్ కోరారు. అనంతరం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాతో దీనిపై నివేదిక ఇప్పించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
తాజ్‌మహల్‌పై హిందూ వర్గాల్లో జరుగుతున్న విస్తృత ప్రచారాన్ని కోర్టు ముందు ఉంచిన పిటిషనర్ ప్రస్తుత తాజ్‌మహల్ స్మారకం ఒకప్పుడు శివాలయమన్న హిందూ సమూహాల వాదనలను ప్రస్తావించారు. కొన్ని హిందూ సమూహాలు ఇప్పటికీ శివుడి తేజో మహాలయంగా తాజ్‌మహల్‌ను విశ్వసిస్తున్నారని కోర్టుకు గుర్తుచేశారు. నాలుగు అంతస్తులు ఉన్న తాజ్‌మహల్‌లో ఎగువ.. దిగువ భాగాల్లో సుమారు 22 గదులు మూసి ఉన్న స్థితిలో ఉండటాన్ని పిటిషనర్ కోర్టుకు గుర్తు చేశారు.
ఇవి దశాబ్దాల కాలంగా మూసి ఉన్నాయన్న పిటిషనర్ వీటి లోపల హిందూ దేవుళ్లు ఉన్నట్లు అనేక మంది చరిత్రకారులు, కోట్లాది మంది హిందువులు విశ్వసిస్తున్నారన్నారు. ఆ గదుల్లోనే పరమేశ్వరుడు కొలువుదీరి ఉన్నారని నమ్ముతున్నట్లు కోర్టుకు తెలిపారు. భద్రతా కారణాల వల్లే ఆ గదులను మూసినట్లు ఆగ్రాలోని పురావస్తు శాఖ ఇచ్చిన నివేదికను సైతం పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. ఇన్ని ప్రశ్నలు, విశ్వాసాలు, తాజ్‌మహల్ చుట్టూ పెన వేసుకొని ఉన్న నేపథ్యంలో వాటి గుట్టును విప్పేందుకు కోర్టుకు చొరవ తీసుకోవాలని పిటిషనర్ కోరారు.
ఇదీ చదవండి: జనావాసాల్లోకి చిరుత.. పట్టుకోబోయిన అధికారులపై దాడి!