పైలట్లు, క్యాబిన్ సిబ్బంది కరోనా టీకా తీసుకుంటే 48 గంటల పాటు విమానంలోకి రావొద్దని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ మంగళవారం ఆదేశించింది. 'టీకా తీసుకున్న తర్వాత 48 గంటల పాటు పైలట్లు, క్యాబిన్ సిబ్బంది విమానాలను నడిపేందుకు వైద్యపరంగా అనర్హులు. ఆ తర్వాత ఎలాంటి లక్షణాలు లేకపోతేనే విధుల్లోకి రావాలి. అయితే 48 గంటల తర్వాత కూడా ఏమైనా లక్షణాలు కన్పిస్తే వారిని వైద్యుల పర్యవేక్షణకు పంపాలి' అని డీజీసీఏ పేర్కొంది.
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. జనవరి 16న ప్రారంభమైన ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2.4 కోట్లకు పైగా టీకాలు డోసులు అందించారు. తొలుత ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్లు ఇవ్వగా.. మార్చి 1 నుంచి 60ఏళ్లు పైబడిన వృద్ధులు, 45-59ఏళ్ల మధ్యవయస్కుల్లో దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు టీకాలు వేస్తున్నారు.
ఇదీ చదవండి: చదువుల్లో టాప్.. ఈ ఉగ్రవాది 'కూతురు'