Tomatoes Free for 8 Passport Size Photos in Kothagudem : గత కొంతకాలంగా టమాట ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతూ.. సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో కిలో టమాటాలు రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో చాలామంది తమ కూరల్లో వీటి వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గిస్తూ.. వంటలు చేసుకుంటున్నారు. కానీ దాదాపు ప్రతి వంటకంలోనూ టమాట అవసరం ఉండటంతో.. ధర ఎంతైనా ఎంతో కొంత కొనుగోలు చేయక తప్పడం లేదు. అంతకంతకూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతున్న ఈ టమాటాలను.. కొన్నిచోట్ల ఫ్రీగా అందిస్తూ కొంతమంది ప్రజలకు బాసటగా నిలుస్తున్నారు. మరికొందరేమో తమ పుట్టిన రోజు కానుకగా పేదలకు టమాటాలను పంచుతున్నారు. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు ఈ టమాటాలను సామాన్యుడి ఇంటికి చేరుస్తున్నారు. మరోవైపు.. ఇవే టమాటాలను ఉపయోగించుకుని కొంతమంది వ్యాపారస్థులు, నిర్వాహకులు తమ తమ గిరాకీలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోవకే చెందుతాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్. వివరాల్లోకి వెళితే..
Photographer Free Tomato Offer : భద్రాద్రి కొత్తగూడెం పట్టణానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి.. స్థానిక కలెక్టరేట్ సమీపంలో గత కొంతకాలంగా ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. స్థానికులతో పాటు కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలతో ఇన్నాళ్లూ షాప్ బాగానే నడిచింది. అయితే ఇటీవల కలెక్టరేట్ పాల్వంచకు మారడంతో ఆనంద్ ఫొటో స్టూడియోకు వచ్చే జనాల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీనికితోడు స్మార్ట్‌ఫోన్ల వినియోగం, డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరాల పుణ్యమా అని స్టూడియోకు వచ్చి ఫొటోలు తీయించుకునేవారే కరవయ్యారు. దీంతో ఆనంద్ ఓ వినూత్న ఆలోచన చేశాడు. టమాట ధరలకు రెక్కలొచ్చిన ఈ తరుణంలో.. దానినే ఉపయోగించి తన గిరాకీ పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఫ్లెక్సీలు వేయించి.. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆనంద్ వినూత్న ప్రచారానికి మంచి స్పందన లభించింది. ఫొటో స్టూడియోకు జనాల తాకిడి పెరిగింది. బుధవారం ఒక్కరోజే 32 మంది వినియోగదారులు దుకాణానికి వచ్చారు. చాలా రోజుల తర్వాత తన షాప్ మళ్లీ జనాలతో కిటకిటలాడటంతో ఆనంద్ ఆనందం వ్యక్తం చేశాడు.
ఇంతకీ ఆనంద్ వినూత్న ఆలోచన ఏంటనేగా మీ డౌట్..? ఏం లేదండీ.. రూ.100 వెచ్చించి తన షాప్‌లో పాస్‌పోర్టు సైజు 8 ఫొటోలు తీసుకున్న వారికి పావు కిలో టమాటాలు ఫ్రీ. అన్నట్టూ.. ఈ ఆఫర్‌ను చూసి బుధవారం రోజున తన షాప్‌లో ఫొటోలు తీయించుకున్న 32 మందికి రూ.40 విలువ గల పావు కిలో టమాటాలను అందించినట్లు ఆనంద్ తెలిపారు.
ఇవీ చూడండి..
Subsidy Tomatoes in AP అక్కడ టమాట కిలో రూ.50 లే..! రైతు బజారుకు క్యూ కట్టిన జనాలు..!