PHD in old age: పీహెచ్డీ.. ఆయన కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా విఫలమయ్యారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా.. ఎలాగైనా పీహెచ్డీ పూర్తి చేయాలని సంకల్పించుకున్నారు. మొక్కవోని దీక్షతో కార్యసాధన మొదలుపెట్టిన ఆయన 92 ఏళ్ల వయసులో కామన్ వెల్త్ ఒకేషనల్ యూనివర్సిటీలో 'సామాజిక, సాంస్కృతిక రాజకీయాల పనితీరు'పై పీహెచ్డీ పూర్తి చేసి.. తన కలను నిజం చేసుకున్నారు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయనే మహారాష్ట్ర సోలాపుర్‌కు చెందిన లాలాసాహెబ్ బాబర్.
![PHD in old age](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mhssppoldmanphdspecialnews_17022022223346_1702f_1645117426_338.jpg)
సామాజిక సేవ కోసం..
బాబర్.. 1930 జనవరి 1న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించారు. ఆయన తండ్రి మాధవరావు బాబర్ గ్వాలియర్‌లోని సింధియా సంస్థాన్‌లో గజ, అశ్వ దళాలకు కమాండర్-ఇన్-చీఫ్‌గా పని చేసేవారు. సోనంద్‌లోని ఓ పాఠశాలలో చదువుకున్నారు. చిన్నతనంలో విద్య ప్రాముఖ్యం గుర్తించారు బాబర్. మరోవైపు గాంధేయ భావజాలం, సిద్ధాంతాలపై ఆసక్తి పెంచుకున్నారు. 1946-50 వరకు ఉపాధ్యాయుడిగా పని చేశారు. సామాజిక సేవ కోసం తన 1950లో ఉద్యోగానికి రాజీనామా చేశారు.
![PHD in old age](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mhssppoldmanphdspecialnews_17022022223346_1702f_1645117426_688.jpg)
ఒక న్యాయమూర్తిగా..!
ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి గ్రామ సర్పంచ్ అయ్యారు. 1952లో సోనంద్ గ్రామ పంచాయతీలో తంతముక్తి గావ్ అభియాన్ యోజన(గొడవలు లేని గ్రామం) అమలు చేశారు. పలు కోర్టు కేసులు, ఫిర్యాదులను ఎవరూ పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండా గ్రామంలోనే పరిష్కరించే ప్రయత్నం చేశారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం గ్రామ భద్రతా దళాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పరిశుభ్రతపై విస్తృతంగా ప్రచారం చేసి.. పరిశుభ్రంగా, అందంగా ఉంచేందుకు ప్రయత్నించారు.
![PHD in old age](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mhssppoldmanphdspecialnews_17022022223346_1702f_1645117426_844.jpg)
విద్య ప్రాముఖ్యాన్ని తెలియజేసి..
గ్రామపంచాయతీ పరిధిలోని ఆరు నుంచి పద్నాలుగేళ్లలోపు విద్యార్థులందరికీ ప్రాథమిక విద్యను అందించాలని పట్టుబట్టి.. తల్లిదండ్రులకు విద్య ప్రాధాన్యాన్ని తెలియజేశారు. చదువుకున్న యువకులందరినీ ప్రాథమిక ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. బాబర్ తన జిల్లాలోని పలు సామాజిక కమిటీల్లో సభ్యునిగా పనిచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
ఇదీ చూడండి: 4 ఏళ్ల తర్వాత నరసింహ ఆలయం ఓపెన్ .. పీకల్లోతు నీటిలో వెళ్తేనే దర్శనం..