రెండోదశ కరోనా ఉద్ధృతితో బిహార్లో ప్రాణవాయువుకు తీవ్ర కొరత ఏర్పడింది. ఆక్సిజన్ కోసం ఆస్పత్రిలో చేరిన ఓ కొవిడ్ రోగి.. ప్రాణవాయువు అందకుండానే చనిపోయాడు. ఆ తర్వాత.. మృతదేహానికి ఆక్సిజన్ సరఫరా అందించారు అక్కడి వైద్య సిబ్బంది.
అసలేం జరిగిందంటే?
శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న ఓ కరోనా బాధితుడిని.. సుఫౌల్ జిల్లా, త్రివేణిగంజ్లోని కొవిడ్ కేర్ సెంటర్కు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. ఆ సమయంలో రోగి ఆక్సిజన్ స్థాయి 65గా ఉందని వెంటనే ప్రాణవాయువు అందించాలని అక్కడి నర్సును బంధువులు అడిగారు. కానీ, ఆక్సిజన్ పెట్టేందుకు అక్కడ వైద్యులెవరూ లేరు. ఆ తర్వాత వచ్చిన డాక్టర్.. రోగిని పరీక్షించి.. పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో తమకు అత్యవసర వాహన సౌకర్యం కల్పించాలని.. నాలుగు గంటల పాటు అధికారులను వేడుకుని విఫలయమయ్యారు బాధిత కుటుంబ సభ్యులు. చివరకు ఆక్సిజన్ అందించకముందే కొవిడ్ రోగి మృతిచెందాడు.
చనిపోయాక ప్రాణవాయువు!
అయితే.. తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు మృతదేహానికి ఆక్సిజన్ సరఫరా అందించారు ఆస్పత్రి సిబ్బంది. కొవిడ్ కేర్ సెంటర్లో పడకలు ఖాళీ లేక.. ఆస్పత్రి బయటే బాధితుడికి ఆక్సిజన్ సరఫరా పెట్టిన దృశ్యాలు చూస్తే హృదయం కలచివేయక మానదు.
ఈ పూర్తి వ్యవహారంపై జిల్లా పోలీసు అధికారులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపడతామని మృతుడి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి: కరోనా వేళ దిల్లీ సరిహద్దుల్లో రైతుల స్వయం సంరక్షణ!