ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలకు విజ్ఞాపనలు అందడం షరా మామూలే. కానీ మహారాష్ట్రలోని ఓ ఎమ్మెల్యేకు కార్యకర్త నుంచి వచ్చిన విజ్ఞప్తికి సంబంధించిన ఫోన్ కాల్ చర్చనీయాంశంగా మారింది. తాను పెళ్లి చేసుకొనేందుకు ఓ అమ్మాయిని వెతికి పెట్టాలంటూ ఓ కార్యకర్త శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన కన్నాడ్ ఎమ్మెల్యే ఉదయ్‌సింగ్ రాజ్‌పూత్‌ను కోరాడు. తాను పెళ్లి చేసుకొనేందుకు ఓ అమ్మాయిని చూసిపెట్టాలని.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఇదే అసలైన సమస్య అంటూ ఎమ్మెల్యేకు వివరించారు.
వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఖుల్తాబాద్ ప్రాంతానికి చెందిన ఓ కార్యకర్త ఎమ్మెల్యేకు సోమవారం ఫోన్ చేశాడు. తనకు జీవిత భాగస్వామిని చూడాలని కోరాడు. "నాకు 8-9 ఎకరాల భూమి ఉంది. కానీ నేను పెళ్లి చేసుకుంటానంటే ఎవరూ పిల్లను ఇచ్చేందుకు సిద్ధపడటంలేదు. కన్నాడ్‌లో అమ్మాయిలు ఉన్నారు" అని తెలిపాడు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. తనకు బయోడేటా పంపాలంటూ కార్యకర్తకు సూచించినట్టుగా ఆడియోలో రికార్డయింది.
మరోవైపు, ఈ అంశంపై ఎమ్మెల్యే రాజ్‌పూత్ మంగళవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ఆ కార్యకర్త ఆందోళన గ్రామాల్లో నెలకొన్న ఈ సమస్య తీవ్రతను ప్రతిబింబిస్తోందన్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ తనకు చాలా వస్తున్నాయని చెప్పారు. "పరిస్థితి ఏమీ అంత బాగా లేదు. గ్రామంలో 2వేల మంది జనాభా ఉంటే.. వారిలో 100 నుంచి 150 మంది వరకు అవివాహిత యువకులే ఉంటున్నారు. వాళ్లకు 100 ఎకరాల భూమి ఉన్నా సరే పెళ్లి కోసం వారికి అమ్మాయిని చూడటం కష్టంగా మారింది. పట్టణ ప్రాంతాల్లో నివసించే కుటుంబాల్లో వారికే తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేయాలని కొన్ని కుటుంబాలు చూస్తున్నాయి" అన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-21) ప్రకారం మహారాష్ట్రలో లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 920మంది మహిళలు ఉన్నారు.