Parliament inauguration Supreme Court : నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం ద్వారా లోక్‌సభ సెక్రటేరియట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని జయ సుఖిన్ అనే న్యాయవాది గురువారం వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ వ్యాజ్యాన్ని ఎందుకు, ఎలా దాఖలు చేశారనేది తమకు తెలుసని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఇలాంటి వాటిని ఏమాత్రం ప్రోత్సహించలేమని స్పష్టం చేసింది.
ఆర్టికల్ 79 ప్రకారం దేశ కార్యనిర్వాహక వ్యవస్థకు రాష్ట్రపతి అధిపతిగా ఉంటారని పిటిషనర్ అడ్వొకేట్ జయా సుకిన్ వాదించారు. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని తప్పక ఆహ్వానించాల్సిందని పేర్కొన్నారు. ఆహ్వానం పంపకుండా.. లోక్‌సభ సెక్రెటేరియట్, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతిని అవమానించాయని ఆరోపించారు. పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించకపోతే.. ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని ధర్మాసనాన్ని కోరారు. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాత్రం.. పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించొద్దని విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తారని అన్నారు.
ప్రతిపక్షాలు దూరం..
పార్లమెంటు నూతన భవనాన్ని రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి ప్రారంభించనుండటాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నెల 28న జరగబోయే ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ 19 విపక్ష పార్టీలు ఇటీవల సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, RJD, DMK, శివసేన-UBT, JMM, సమాజ్ వాదీ వంటి పార్టీలు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన జాబితాలో ఉన్నాయి. పార్లమెంట్ ఓపెనింగ్‌కు ప్రతిపక్షాలు గైర్హాజరవ్వడంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
New Parliament Building Inauguration Date : భారత నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ.. మే 28న ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. కొత్త పార్లమెంట్ నిర్మాణ పనులు రెండేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. 2020 డిసెంబర్లో భవనానికి పునాది రాయి వేశారు ప్రధాని మోదీ. నిజానికి గతేడాది నవంబర్లోనే భవనం పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల నిర్మాణం ఆలస్యమైంది.
Parliament New Building : 64,500 చదరపు మీటర్ల పరిధిలో కొత్త పార్లమెంట్ భవనం ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులు ఉంటాయి. ప్రస్తుత భవనాన్ని పోలినట్లు ఉండే కొత్త పార్లమెంట్ ఎత్తు సైతం పాత భవనం అంతే ఉంటుంది. ఒకేసారి 1224 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండనున్నాయి. ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక ఆఫీసులు ఉంటాయి. ఎంపీల కోసం విశాలమైన లాంజ్, లైబ్రరీ, కమిటీల గదులు, క్యాంటీన్లు ఉండనున్నాయి.