Parliament fire accident: శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో పార్లమెంటు ప్రాంగణంలో బుధవారం ఉదయం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే.. అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి, పది నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తెచ్చారు. పార్లమెంటు భవనంలోని రూమ్ నంబర్ 59 వద్ద ఉదయం 8 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి.
"ఉదయం 8 గంటలకు మంటలు వ్యాపించాయి. 8:10 గంటలకు మంటలను అగ్నిమాపక సిబ్బంది.. అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో కొన్ని కుర్చీలు, బల్లలు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియదు" అని ఓ అధికారి తెలిపారు.
పార్లమెంటులో ఇలాంటి అగ్నిప్రమాదాలు జరిగితే అరికట్టడానికి ఎల్లప్పుడూ అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉంటుందని సదరు అధికారి వివరించారు. బుధవారం ఉదయం ప్రమాద సమాచారం తెలుసున్న వెంటనే.. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి మంటలు అదుపులోకి తెచ్చారని పేర్కొన్నారు.
నవంబరు 29న ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు.. డిసెంబరు 23 వరకు కొనసాగనున్నాయి. పార్లమెంటు భవనంలో ఎల్లప్పుడూ పటిష్ఠ భద్రత ఉంటుంది.
ఇదీ చూడండి: Pulwama Encounter: పుల్వామాలో ఎన్కౌంటర్.. జైషే కమాండర్ హతం