గందరగోళ పరిస్థితుల మధ్య పార్లమెంటులో గురువారం పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. కేంద్రం ప్రవేశపెట్టిన అత్యవసర రక్షణ సేవల బిల్లు, ఎయిర్ క్వాలిటీ బిల్లు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ చట్ట సవరణ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాయి. ఇవన్నీ మూజువాణి ఓటుతోనే గట్టెక్కాయి. మరోవైపు, లోక్‌సభలో కేంద్రం రెట్రో ట్యాక్స్ బిల్లును ప్రవేశపెట్టింది.
ఎస్టీలకు న్యాయం చేస్తుంది..
షెడ్యూల్డ్ ట్రైబ్స్ చట్టం సవరణ బిల్లుతో ఎస్టీలకు న్యాయం జరుగుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా పేర్కొన్నారు. అరుణాల్‌ప్రదేశ్ ప్రభుత్వం సూచనల మేరకు చట్టంలోని గిరిజన తెగలకు సంబంధించి మార్పులు చేస్తున్నామని వెల్లడించారు. నోక్టే, టాంగ్సా, టుట్సా, వాంచో, మోన్పా, మెంబా, సార్టాంగ్, సాజోలాంగ్ తెగల పేర్లను చేరుస్తున్నట్లు తెలిపారు. ఖంప్తీ తెగ పేరును తాయ్ ఖంప్తీగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. ఆది, అబోర్ తెగలు ఒకటే కావడం వల్ల చట్టంలోంచి అబోర్ తెగ పేరును తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఎయిర్ క్వాలిటీ బిల్లు..
దిల్లీ సహా శివారు ప్రాంతాల్లో వాయు కాలుష్య కట్టడికి కమిషన్ ఏర్పాటు చేసేందుకు వీలుగా కేంద్రం ఎయిర్ క్వాలిటీ బిల్లును ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాల నిరనసల మధ్య మూజువాణి ఓటుతో రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అంతకుముందు.. బుధవారం ఈ బిల్లు లోక్‌సభలో ఆమెదం పొందింది.
'వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. కాలుష్యానికి కారకులైన వారికి శిక్ష విధించే సెక్షన్ 14ను సడలిస్తున్నాము' అని పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు.
విపక్షాల నిరసనలపై స్పందిస్తూ.. ఈ బిల్లు వాయు కాలుష్యానికి సంబంధించినదని, కానీ సభలో శబ్ద కాలుష్యమే ఉందని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అమలు చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ ఆ స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు.
అత్యవసర రక్షణ సేవల బిల్లు..
కేంద్రం ప్రవేశపెట్టిన అత్యవసర రక్షణ సేవల బిల్లు ద్వారా సంబంధిత యూనిట్లలోని ఉద్యోగుల తొలగింపు, నిరసనల కట్టడి, లాకౌట్లు ప్రభుత్వ అధీనంలోకి రానున్నాయి. జూన్‌లో ప్రవేశపెట్టిన ఆర్డినెన్సు స్థానంలో ఈ బిల్లును చేర్చనున్నారు. లోక్‌సభలో మంగళవారం ఈ బిల్లు ఆమోదం పొందింది.
ఆయుధ ఉత్పత్తి కేంద్రాల సామర్థ్యాన్ని పెంచాలని కేంద్రం భావిస్తోందని.. అందుకే ప్రైవేటీకరణ ద్వారా సంస్కరణలు చేపట్టనున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ బిల్లు ఒక్క ఏడాది మాత్రమే అమలులో ఉంటుందని.. ఆ తర్వాత దానిని కొనసాగించాలంటే ప్రభుత్వం దానిని పురుద్ధరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ బిల్లుపై యూనియన్లతో చర్చించామని.. ఉద్యోగులకు ఎలాంటి హాని కలగదని రాజ్‌నాథ్ తెలిపారు. శాంతియుత నిరసనలకు ఈ బిల్లు అడ్డంకి కాదన్నారు.
రెట్రో ట్యాక్స్ బిల్లు..
రెట్రోస్పెక్టివ్ పన్ను వసూలు విధానాన్ని రద్దు చేస్తూ కేంద్రం లోక్‌సభలో పన్ను చట్టాల సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. యూపీఏ హయాంలో తీసుకొచ్చిన ఈ చట్టాన్ని రద్దు చేయాలన్నది కేంద్రం ప్రతిపాదన.
పాత తేదీల నుంచి పన్ను వసూలు చేసే పద్ధతినే రెట్రోస్పెక్టివ్ అని పిలుస్తారు.
పెగసస్ రగడ..
పెగసస్ అంశంపై చర్చించాలంటూ చేస్తున్న డిమాండ్‌ను కాంగ్రెస్ మరోసారి లేవనెత్తింది. కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని ఆరోపించింది. ప్రజా సమస్యలపై విపక్షాలు పోరాటం కొనసాగిస్తాయని కాంగ్రెస్ పేర్కొంది.
"పెగసస్ అంశంపై చర్చల నుంచి తప్పించుకునేందుకు కేంద్రం దారిమళ్లించే ప్రయత్నాలు చేస్తోంది. భారత్ మినహా ఫ్రాన్స్, హంగరీ, బల్గేరియా సహా ప్రపంచ దేశాలు పెగసస్‌పై దర్యాప్తు చేయిస్తున్నాయి. చర్చలకు ఎందుకు భయపడుతున్నారు?"
-మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నేత
పెగసస్ వివాదంపై స్పందించిన భాజపా.. పలువురి ఫోన్ నెంబర్లు ట్యాప్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది.
'అర్థవంతమైన చర్చలకు కేంద్రం సిద్ధంగా ఉంది. అది పెగసస్ వివాదం.. లేదా రైతు సమస్యలు అయినా సరే. కాంగ్రెస్.. కేవలం ఓ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు సంస్థలా వ్యవహరిస్తోంది' అని భాజపా నేత రవిశంకర్ అన్నారు.
ఇదీ చదవండి : 'ప్రజల గొంతు నొక్కే ఆయుధమే 'పెగసస్''