ఎంత వెతికినా పిల్ల దొరకడం లేదు. పెళ్లి కల నెరవేరుతుందన్న నమ్మకం లేదు. వయసేమో 30 దాటి 40 వైపు పరుగులు తీస్తోంది... ఇది ఏ ఒక్క 'పెళ్లి కాని ప్రసాదు' కష్టమో కాదు. ఏకంగా 40 వేల మంది తమిళ బ్రాహ్మణ యువకులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న (Tamil nadu news) అతి పెద్ద సమస్య.
అందుకే ఓ 'స్పెషల్ డ్రైవ్' చేపట్టింది తమిళనాడు బ్రాహ్మణ సంఘం-తంబ్రాస్. ఉత్తర్ప్రదేశ్, బిహార్లో తమ సామాజిక వర్గానికి చెందిన వధువుల (Tamil Brahmin Wedding) కోసం వేట మొదలుపెట్టింది. ఇదే విషయాన్ని తంబ్రాస్ మేగజైన్ (Tamil Brahmin matrimony) నవంబర్ ఎడిషన్లో బహిరంగ లేఖ ద్వారా వెల్లడించింది.
"పెళ్లి వయసులో 10 మంది బ్రాహ్మణ యువకులు ఉంటే.. వారిలో ఆరుగురికి మాత్రమే తమిళనాడులో వధువు దొరుకుతోంది. అందుకే మా సంఘం తరఫున ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించాం. ఈ కార్యక్రమం కోసం దిల్లీ, లఖ్నవూ, పట్నాలో సమన్వయకర్తల్ని నియమిస్తాం. చెన్నైలోని తంబ్రాస్ ప్రధాన కార్యాలయంలో ఉండి ఇతర రాష్ట్రాల్లోని ప్రతినిధులతో సమన్వయం చేసేందుకు.. హిందీ రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చిన వారికి ఉద్యోగం ఇస్తాం. దీని గురించి లఖ్నవూ, పట్నాలోని వారితో ఇప్పటికే మాట్లాడా. ఈ కార్యక్రమం ఆచరణసాధ్యమే. ఇప్పటికే పని మొదలుపెట్టాను."
--తంబ్రాస్ అధ్యక్షుడు ఎన్. నారాయణన్.
తంబ్రాస్ ప్రయత్నాల్ని ఆ సామాజిక వర్గంలోని అనేక మంది స్వాగతించారు. మరికొందరు మాత్రం భిన్నంగా స్పందించారు. పెళ్లికి భారీగా ఖర్చు చేయాలని వరుడి కుటుంబాల వారు ఒత్తిడి చేయడం వల్లే వారికి సరైన సంబంధాలు దొరకడం లేదని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: వారు 'వర్క్ ఫ్రమ్ హోం' చేసేందుకు కేంద్రం నో- సుప్రీం అసహనం