కరోనా కష్టాలను దేశం సంఘటితంగా అధిగమించిందని చెప్పారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. భారత్ ఎన్నో కష్టాలను ఐక్యంగా ఎదుర్కొందన్నారు. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో జరుగుతోందని తెలిపారు. రెండు వ్యాక్సిన్లను దేశీయంగా రూపొందించామని చెప్పారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి వెంకయ్య నాయుడు ప్రసంగించారు. ఆత్మనిర్మర్ భారత్ అంటే దేశంలో తయారీకి మాత్రమే పరిమితం కాదన్నారు. ప్రతి పౌరుని జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచి, వ్యవసాయం రంగంలో స్వావలంబన సాధించడమే ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యమని తెలిపారు.
దేశానికి అన్నం పెట్టే రైతుల సేవలు మరువలేనివని, రైతుల కృషి కారణంగా దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని వెంకయ్య చెప్పారు. 2019-20 సంవత్సరంలో 296 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి చేశారని, రికార్డుస్థాయిలో ఆహారధాన్యాలు ఉత్పత్తి చేసిన రైతులకు అభినందనలు తెలియజేశారు.