ఒడిశా కలహండి జిల్లా కర్లాపాత్ అభయారణ్యంలో మరో ఏనుగు మృతి చెందింది. నెల రోజుల వ్యవధిలోనే ఏడు ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. గజరాజుల మరణానికి పశువుల్లో వ్యాపించే హేమోర్హేజ్ సెప్టీస్కేమియా అనే వ్యాధిగా అధికారులు తెలిపారు. అయితే.. వీటిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏనుగుల మృతిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పశుసంవర్ధక శాఖ అధికారి గణేశ్ పుఝారిని సస్పెండ్ చేసినట్లు జిల్లా ప్రధాన వెటర్నరీ అధికారి చైతన్య శెట్టి తెలిపారు. సదరు అధికారి ఏనుగులకు వ్యాక్సినేషన్, చికిత్స అందించినట్లు ఎలాంటి రికార్డులు లేవని, జంతువుల ఆరోగ్యంపై నిఘా వేయటంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు చెప్పారు.
మరోవైపు.. ఈ అభయారణ్యంలో మరో మూడు జంతువులు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించామన్నారు శెట్టి. వెటర్నరీ సిబ్బందిని రంగంలోకి దింపి పెద్ద ఎత్తున టీకాలు వేస్తున్నట్లు చెప్పారు. అలాగే.. ఏనుగుల మందలను గుర్తించేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృందాలను 10కి పెంచుతున్నట్లు డివిజనల్ ఫారెస్ట్ అధికారి అశోక్ కుమార్ తెలిపారు.
ఏనుగుల మృతి నేపథ్యంలో కర్లాపాత్ అభయారణ్యాన్ని దిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు సభ్యుల కేంద్ర బృందం సందర్శించింది. గజరాజుల మరణానికి హేమోర్హేజ్ సెప్టీస్కేమియా వ్యాధి కారణంగా తేల్చింది.
ఇదీ చూడండి: పానీపూరీ వివాదం.. భయానక వాతావరణం