Crow Attack: ఇది కేరళలోని మలప్పురం పరిధిలోని ఒలియాంక గ్రామం. కాకి పేరు చెబితే చాలు, ఈ ఊరి ప్రజలు హడలిపోతున్నారు. మనుషులు రోడ్డుపై కనిపించడమే పాపం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కనిపించిన ప్రతీవారిపై కాకులు దాడి చేస్తుండటంతో.. ప్రజలు రోడ్లపై నడిచేప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మూడున్నర నెలల క్రితం ఇంటిని నిర్మిస్తున్న కూలీలపై కాకులు దాడి చేయడంతో సమస్య మొదలైంది. కాకుల దాడిపై ఆగ్రహించిన ఓ కార్మికుడు చెట్టుపై ఉన్న కాకి గూడును ధ్వంసం చేశాడు. అంతే ఇక అప్పటివరకు వారిపై మాత్రమే దాడి చేసే కాకులు ప్రజలందరిపై దాడులు చేస్తున్నాయి. వీధి కుక్కలపై కూడా ప్రతాపం చూపుతున్నాయి.
అప్పటి నుంచి ఒలియాంక గ్రామ ప్రజలు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే వణికిపోతున్నారు. చేతిలో కర్ర, తలకు హెల్మెట్ లేకుంటే బయటకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకులు కేవలం స్థానికులపై మాత్రమే దాడి చేస్తున్నాయని.. బయటి వారిని వదిలేస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది సాయంతో, కాకుల బెడదను తొలగించుకోవాలని ప్రజలు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: కన్నవాళ్లు లేకున్నా సడలని సంకల్పం- 'డాక్టర్' కల సాకారం!