Odisha Train Accident : విషాదకర ఒడిశా రైలు ప్రమాద ఘటన మాటల్లో వివరించలేనిది. ఇప్పటికే 278 మంది మృతి చెందారు. ఇంతటి మారణహోమంలో ముగ్గురు వ్యక్తులు బతికిబట్టకట్టారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావటం గమనార్హం. బంగాల్ రాష్ట్రం మెదినీపుర్ జిల్లా మలుబాసన్ గ్రామానికి చెందిన సుబ్రొతో పాల్.. తన భార్య, కుమారుడుతో కలిసి శుక్రవారం ఖరగ్పుర్ స్టేషన్ వద్ద కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో చెన్నై బయళ్తేరాడు. రైలు బాలేశ్వర్కు చేరుకోగానే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి బయట పడడం పునర్జన్మగా భావిస్తున్నానని సుబ్రొతో అన్నారు. తమ కుమారుడి వైద్యం కోసం చెన్నై వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
"మేము శుక్రవారం ఖరగ్పుర్ స్టేషన్ నుంచి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో చెన్నై బయళ్తేరాము. అప్పటివరకు ప్రయాణికులు ప్రశాంతంగా ఉన్నారు. బాలేశ్వర్ వద్దకు చేరుకోగానే.. రైలు కుప్పకూలినట్లు అయ్యింది. దాంతో మా కంపార్ట్మెంట్ అంతా పొగతో నిండిపోయింది. నేను ఎవరినీ చూడలేకపోయా. ఘటనాస్థలి వద్దకు స్థానికులు చేరుకుని నన్ను శిథిలాల నుంచి బయటకు లాగారు. ఆ భగవంతుడి దయ వల్ల నేను మరో జన్మ పొందాను."
-సుబ్రొతో పాల్, ప్రయాణికుడు
"మా బాబు చికిత్స నిమిత్తం మేము చెన్నె వెళ్తున్నాం. బాలేశ్వర్ వద్ద రైలు ప్రమాదానికి గురవ్వగానే మాకేమీ అర్థం కాలేదు. అప్పటికి నేను ఎవరినీ గుర్తు పట్టే స్థితిలో లేను. మా బాబును సైతం కనిపెట్టలేకపోయా. అసలు అంత పెద్ద ప్రమాదం నుంచి ఎలా బతికి బయటపడ్డామో కూడా తెలీదు. ప్రమాదం తాలూకు దృశ్యాలు ఇంకా నా కళ్ల ముందే కదలాడుతున్నాయి. నిజంగా ఆ భగవంతుడు మాకు పునర్జన్మను ప్రసాదించాడనే చెప్పాలి."
- సుబ్రొతో భర్య దేబోశ్రీ పాల్.
Odisha Train Accident : ప్రమాద తాలూకా దృశ్యాలు చూసినవారినే ఇంత కలవరపెడుతుంటే.. అంతటి హృదయవిదారక ఘటన ప్రత్యక్షంగా రైళ్లో ప్రయాణం చేసిన వారి కళ్లల్లో ఇంకా తిరుగుతూనే ఉంది. ప్రమాదం సమయంలో రైళ్లో ఉన్న చాలా మంది ఎమర్జెన్సీ కిటికీ ద్వారా బయటకు వచ్చినట్లు తెలిపారు. ప్రమాదం జరగ్గానే స్పృహ కోల్పోయిన కొందరు అస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. మరికొందరు అసలు ఏం జరిగిందో తెలియని స్థితిలో ఉన్నారు.
14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చి.. మృత్యువు ఒడికి..
ఈ ప్రమాద ఘటనలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఒడిశాలోని బాలేశ్వర్ ప్రాంతానికి చెందిన రమేశ్ జెన అనే యువకుడు తన తల్లి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై నుంచి బాలేశ్వర్ వచ్చాడు. తిరిగి చెన్నై వెళ్తుండగా.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మృతి చెందాడు. కాగా మృతుడు రమేశ్ 14 ఏళ్ల క్రితం చెన్నై వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. తన తల్లి చనిపోయిన వార్త తెలుసుకొని 14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చాడు.