Odisha Train Accident Cbi Chargesheet : ఒడిశా బాలేశ్వర్ రైలు దుర్ఘటన కేసులో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు రైల్వే ఉద్యోగులపై సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. హత్యనేరంతో పాటు సాక్ష్యాలను నాశనం చేసేందుకు యత్నించారని ఛార్జీషీటులో పేర్కొంది. ఈ రైలు ప్రమాద ఘటనలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరుణ్‌కుమార్ మహంత, సెక్షన్ ఇంజినీర్ అమీర్ ఖాన్, టెక్నిషియన్ పప్పు కుమార్‌లను సీబీఐ.. జులైలో అరెస్టు చేసింది.
బహానగా బజార్ రైల్వే స్టేషన్ సిగ్నల్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించే బాధ్యత నిందితులపై ఉందని సీబీఐ పేర్కొంది. బహానగా బజార్ స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగిన 94వ లెవెల్ క్రాసింగ్ గేట్ వద్ద మరమ్మతు పనులు మహంత సమక్షంలోనే జరిగాయని సీబీఐ పేర్కొంది. అయితే, ఈ పనులకు 79వ లెవెల్ క్రాసింగ్ గేట్‌కు సంబంధించిన సర్క్యూట్ రేఖాచిత్రాన్నే ఉపయోగించారని తెలిపింది. ఇప్పటికే ఉన్న సిగ్నల్, ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలను పరీక్షించడం, మరమ్మతులు చేపట్టడం, మార్పులు చేయడం, సూచనలకు అనుగుణంగా ఉన్నాయనేది నిర్ధరించుకోవాల్సిన మహంత.. తన విధులను విస్మరించారని వెల్లడించింది.
రైల్వే సేఫ్టీ కమిషన్- సీఆర్ఎస్ కూడా సమాంతరంగా దర్యాప్తు చేపట్టింది. సిగ్నలింగ్ అనేక స్థాయిల్లో లోపాలు ఉన్నట్టు గుర్తించి రైల్వే బోర్డుకు జులైలో నివేదిక సమర్పించింది. గతంలో ఇదే తరహాలో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకొని ఉంటే ఈ రైలు దుర్ఘటన తప్పేదని తెలిపింది. రాంగ్ వైరింగ్, రాంగ్ కేబుల్ వల్ల 2022 మే 16న ఇదే తరహా దుర్ఘటన ఖరగ్‌పూర్ డివిజన్‌లో జరిగిందని నివేదిక తెలిపింది. అప్పుడే దాన్ని సరిచేసే చర్యలు చేపట్టి రాంగ్ వైరింగ్ సమస్యను పరిష్కరించిఉంటే ఒడిశాలోని బహనాగా బజార్ వద్ద ఈ రైలు దుర్ఘటన చోటుచేసుకొని ఉండేది కాదని తెలిపింది. సిగ్నలింగ్, సర్క్యూట్ మార్పులో లోపాలే ఈ ప్రమాదానికి కారణమని తేల్చింది.
మాటలకు అందని విషాదం..
జూన్ 2న బాలేశ్వర్ జిల్లాలోని బాహానగా బజార్ స్టేషన్ వద్ద షాలిమార్- చెన్నై కోరమాండల్ రైలు.. ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొట్టగా పెను ప్రమాదం జరిగింది. గూడ్స్‌ను అతివేగంగా ఢీకొట్టిన తర్వాత కోరమాండల్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ బోగీలను బెంగళూరు- హవ్డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టగా.. ప్రమాదం మరింత తీవ్రంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 296 మంది ప్రాణాలు కోల్పోయారు. 1200 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే సీబీఐ ఈ కేసు విచారణ చేపట్టింది.
'ఆ పుకార్లు నమ్మొద్దు.. దర్యాప్తు అయ్యేవరకు ఆగండి'.. ఒడిశా రైలు ప్రమాదంపై వైష్ణవ్
'రాంగ్ సిగ్నలింగ్ వల్లే ఒడిశా రైలు దుర్ఘటన.. అలా చేసి ఉంటే ప్రమాదం తప్పేది'