ఆ ఇంట్లో ఎక్కడ చూసినా...అవార్డులు, పతకాలే దర్శనమిస్తాయి. వాటన్నింటినీ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఇంతకీ ఇవన్నీ ఎవరిని వరించాయి అనుకుంటున్నారా? ఒడిశా, బాలసోర్ జిల్లాలోని ఇచ్చాపూర్‌కు చెందిన మిహిర్ కుమార్ పాండా శాస్త్రరంగంలో చేస్తున్న ఆవిష్కరణలకు గానూ...ఈ అవార్డులన్నీ దక్కాయి.
ఇంట్లోనే ప్రయోగశాల
వృత్తిరీత్యా మిహిర్ ఇంజనీర్ అయినా సైన్స్ పరిశోధనలపై ఆయనకు ఆసక్తి ఎక్కువ. అందుకే ఇంట్లోనే ప్రయోగశాల ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ 10 వేలకు పైగా ప్రాజెక్టులు కనిపిస్తాయి. అవన్నీ సామాన్యులు ఎదుర్కునే వివిధ సమస్యలకు పరిష్కారాలే. రెండు ముఖాల పంకా, హార్వెస్టింగ్ యంత్రంగా పనిచేసే సైకిల్ రిక్షా, విద్యుదుత్పత్తి చేసే పంకా, చౌక రిఫ్రిజిరేటర్లు, డిజిటల్ సేఫ్ లాకర్, ఒకేసారి విభిన్న పొడులు చేసే యంత్రం ఆయన ఆవిష్కరణల్లో కొన్ని. అందుకే ఒడిశా ఐన్‌స్టీన్‌గా విశిష్ట గుర్తింపు పొందాడు మిహిర్ కుమార్.
25 ప్రపంచ రికార్డులు
మన దేశంలో శాస్త్రరంగంలో పరిశోధనల ద్వారా కృషి చేస్తున్న తొలి ఆరుగురిలో మిహిర్ ఒకరు. ఇప్పటివరకూ 25 ప్రపంచ రికార్డులు సృష్టించిన ఘనత ఆయన సొంతం. కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ పురస్కారం సహా..లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సైతం సంపాదించుకున్నాడాయన. ఆయన చేసిన అరుదైన ఆవిష్కరణలకు గానూ....250కి పైగా అవార్డులు అందుకున్నాడు. తండ్రి విజయం చూసిన మిహిర్ కుమారుడు కూడా.. భవిష్యత్తులో ఆవిష్కరణలు చేసే దిశగా ప్రయోగాలు చేస్తున్నాడు.
పిల్లల ప్రశ్నలే ఐడియాలు
అవసరం ఆవిష్కరణకు మూలం. మిహిర్ పరిశోధనలకు ప్రధాన కారణం మాత్రం ఆయన విద్యార్థులే. పిల్లలకు పాఠాలు చెప్తుండగా వాళ్లడిగే ప్రశ్నలే తనలో ఆలోచనలు రేకెత్తించేవని, ఫలితంగా పరిశోధనల వైపు మనసు మళ్లిందని చెప్తున్నాడు మిహిర్. తాను నిత్యంచూసే సామాన్యుల చిన్నచిన్న సమస్యలే ప్రయోగాల దిశగా ఎప్పటికప్పుడు తనలో స్ఫూర్తి నింపుతుందని చెబుతున్నాడు.
నిత్యం సామాన్యులు ఎదుర్కునే సమస్యలకు తన పరిశోధనల ద్వారా పరిష్కారం చూపుతున్న మిహిర్ ఎంతోమందికి ఆదర్శనీయం.
"1987లో విద్యార్థులకు పాఠాలు చెప్పేవాడిని. ఊర్లోని పిలల్లు సైన్స్ చదువుకునేందుకు నావద్దకు వచ్చేవారు. క్రమంగా వారి సంఖ్య పెరిగింది. ప్రశ్నలు విపరీతంగా అడిగేవారు. వాళ్ల సందేహాలు నివృత్తి చేసే క్రమంలో ఎన్నో ఉత్పత్తులు తయారుచేయగలిగాను. ఉదాహరణకు... ఊర్లో కొందరు తాళ్లు తయారుచేస్తున్నారనుకోండి. వాళ్లకోసం సులభంగా తాళ్లు పేనే యంత్రం తయారు చేసి ఇచ్చాను. సామాన్యులకు సైన్స్ ఉపయోగపడేలా చేయాలన్నదే నా జీవిత లక్ష్యం. నా ఆవిష్కరణలు వారికి ఉపయోగపడితే చాలు."
-మిహిర్ పాండా, శాస్త్రవేత్త
"మిహిర్ సర్‌తో కలిసి 20 ఏళ్లుగా పనిచేస్తున్నా. తన సొంత ప్రాజెక్టుల గురించి మాకు నేర్పిస్తారు. నాలాగే మరో ఏడెనిమిది మంది ఇక్కడ పనిచేస్తున్నారు."
-డైటరీ మాలిక్, మిహిర్ సహాయకుడు
"మా నాన్న ఎప్పుడూ పరిశోధనలతో బిజీగా ఉంటారు. తన ఆవిష్కరణలు జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో గుర్తింపు పొందాలన్నదే ఆయన తపన. మా నాన్న కన్న కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటున్నా."
-యశోబాంతా పాండా, మిహిర్ కుమారుడు