Nurse found hanging: ఉత్తర్ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలో దారుణం జరిగింది. బంగర్మౌ కొత్వాలీ ప్రాంతంలోని ఆస్పత్రి ఆవరణలోనే ఓ నర్సు ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. నర్సుగా ఉద్యోగంలో చేరిన తర్వాతి రోజే ఈ ఘటన జరిగింది. మృతదేహం అనుమాస్పద రీతిలో గోడకు వేలాడుతూ ఉండటాన్ని చూసిన ఆస్పత్రి వర్గాలు.. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాయి.
అయితే, నర్సు మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపించారు. నిందితులే ఆమెకు ఉరి వేసి చంపేసి ఉంటారని అన్నారు. ఈ మేరకు పోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు.
"న్యూజీవన్ ఆస్పత్రిలో శుక్రవారమే ఆమె నర్సుగా చేరిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మరణానికి గల కారణాలను అన్వేషిస్తున్నాం. పోస్టు మార్టం నివేదిక రావాల్సి ఉంది. కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నాం. ముగ్గురు పేర్లను అనుమానితులుగా చేర్చాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని ఉన్నావ్ అదనపు ఎస్పీ శశి శేఖర్ సింగ్ తెలిపారు.
Madhya Pradesh 4 year girl Rape: మధ్యప్రదేశ్లోని రీవాలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. బాలిక తన తండ్రి టీ షాప్ వద్ద ఆడుకుంటూ.. పక్కనే ఉన్న ఓ చెప్పుల దుకాణం దగ్గరికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆ దుకాణం యజమాని చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. శనివారం ఈ ఘటన జరిగింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
6 Months girl rape Delhi: మరోవైపు, దిల్లీలో ఆరు నెలల పసికందుపై తన పశువాంఛ తీర్చుకున్నాడు 40ఏళ్ల వ్యక్తి. తన స్నేహితుడితో కలిసి మరో బాలికపైనా అత్యాచారం చేశాడు. సమయ్పుర్ బద్లి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు కమల్ మల్హోత్రా అలియాస్ చిన్నును పోలీసులు అరెస్టు చేశారు. అతడి స్నేహితుడు రాజు సైతం పసికందుపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. మహిళకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 14 ఏళ్ల బాలికకు మతిస్థిమితం లేదు. ఆరేళ్ల బాలిక తన అక్కతో కలిసి ఇంటి పక్కన ఆడుకుంటోంది. ఈ క్రమంలోనే చిన్ను, రాజు బాలికలపై కన్నేశారు. చుట్టూ ఎవరూ లేరని గమనించి.. అత్యాచారానికి ఒడిగట్టారు. బాలికల అరుపులు విని వారి తల్లి హుటాహుటిన అక్కడికి చేరుకుంది. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
పోలీసులు రంగంలోకి దిగి.. చిన్నును అరెస్టు చేశారు. రాజు కోసం వెతుకుతున్నారు. అయితే, అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు చుక్కలు చూపించాడు చిన్ను. నాటు తుపాకీతో పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసుల ఎదురుకాల్పుల్లో నిందితుడి కాలికి బుల్లెట్ తగిలింది. దీంతో అతడిని అరెస్టు చేశారు. పిస్తోల్ను స్వాధీనం చేసుకున్నారు. ఘటన సమయంలో నిందితులు ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని తెలిపారు.
Tamil Nadu caste band issue: విద్యార్థుల మధ్య చెలరేగిన కులం చిచ్చు ఓ బాలుడి ప్రాణాలు తీసింది. చేతికి కట్టుకునే క్యాస్ట్ బ్యాండ్ విషయమైన పన్నెండు, పదకొండో తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలోని పోతుకుడి ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. పన్నెండో తరగతి చదువుతున్న సెల్వసూర్యపై ఏప్రిల్ 25న ఇద్దరు పదకొండో తరగతి విద్యార్థులు దాడి చేశారు. సెల్వసూర్యపై రాళ్లు విసరడం వల్ల తలకు బలంగా గాయమైంది. పోలీసులు రంగంలోకి దిగి.. విద్యార్థులను శాంతింపజేశారు. ఆ తర్వాతి రోజు రాత్రి సెల్వసూర్య ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ఏప్రిల్ 30న ప్రాణాలు కోల్పోయాడు. దీంతో 11వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులపై కేసు నమోదు చేశారు పోలీసులు. వారిని అదుపులోకి తీసుకున్నారు. తమ కుమారుడి మృతికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Delhi Couple suicide Cancer: మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్న దిల్లీకి చెందిన ఓ జంట.. చావులోనూ తమ బంధాన్ని వీడలేదు. గ్రేటర్ నోయిడాకు చెందిన ప్రైవేట్ టెక్నీషియన్ అరుణ్(34)కు క్యాన్సర్ సోకింది. వ్యాధి చివరి దశలో ఉందని వైద్యులు చెప్పారు. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయిన అతడు.. ఈ విషయం తన భార్య శశికళకు చెప్పాడు. అనంతరం, సూసైడ్ నోట్ రాసి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు సమాచారం అందుకొని ఘటనాస్థలికి వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్లో ఉన్న ఫోన్ నెంబర్లను సంప్రదించి.. సమాచారం అందించారు.
ఇదీ చదవండి: గుప్తనిధుల కోసం తండ్రినే బలి ఇవ్వబోయిన కుమారుడు