సాధారణ రైల్వే సేవలను తిరిగి ప్రారంభించే విషయంలో స్పష్టమైన తేదీని ఇప్పట్లో చెప్పలేమని రైల్వే శాఖ ప్రకటించింది. ఇందుకోసం రైల్వే సీనియర్ అధికారులు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి దశల వారీగా ఈ సేవలను తిరిగి మొదలుపెడతామని స్పష్టం చేసింది.
కరోనా వ్యాప్తి కారణంగా రైల్వే సేవలను నిలిపి వేయడం వల్ల.. ఈ ఏడాది ఆదాయం బాగా క్షీణించిదని రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ప్రయాణికుల ఆదాయంలో 87శాతం వరకు తగ్గుదల నమోదైందని చెప్పారు. అయితే.. ఈ నష్టాన్ని సరకు రవాణాతో అధిగమించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు యాదవ్. అందులో భాగంగా ఇప్పటికే 97శాతానికి చేరువయ్యామని.. త్వరలోనే దాన్ని అధిగమిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఆదాయంలో 87శాతం తగ్గుదల
ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఇప్పటివరకు రైల్వే శాఖకు ప్రయాణికుల నుంచి రూ. 4,600 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు యాదవ్. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇది రూ.15వేల కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. అయితే 2019-20 ఏడాదిలో ఈ ఆదాయం రూ.53 వేలుగా ఉండిందని.. దాంతో పోలిస్తే ఈ సంవత్సరం 87శాతం తక్కువగా నమోదైందన్నారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,089 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని యాదవ్ పేర్కొన్నారు. అయితే.. ఇప్పటికీ సగటున 30-40 శాతమే ఆక్యుపెన్సీ నమోదవుతోందన్న ఆయన.. ప్రజల్లో ఇంకా కరోనా భయం వెంటాడుతోందని చెప్పారు.
ఇదీ చదవండి: 'రైతులను తప్పుదోవ పట్టించటం మానుకోవాలి'