NO Salaries to 108 Employees in AP: అత్యవసర సేవలందించే వారి జీవితాల్లో ఆనందం కరవైంది. 3 నెలలకు పైనుంచి వేతనాలు అందక పండగలకు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. సంక్రాంతికైనా జీతాలు అందుతాయో లేదో తెలియని దుస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 108, 104, 102 ఉద్యోగులు జీతాల కోసం పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీల తరహాలో ఆందోళన బాట పట్టాలని యోచిస్తున్నారు.
వేతనాలందక దసరా సంబరాలు లేవు. దీపావళి వెలుగులు లేవు. క్రిస్మస్ సందడి లేదు. ఇప్పుడు సంక్రాంతికైనా చెల్లిస్తారో లేదోనని అత్యవసర సేవలు అందించే 108, 102, 104 సిబ్బంది వాపోతున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 108 ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా అందడం లేదు.
ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం 108 సిబ్బంది ఉద్యోగ భద్రతపై హామీ ఇచ్చిన జగన్ నాలుగున్నరేళ్లయినా నెరవేర్చలేదు. కనీసం వారికి సకాలంలో వేతనాలు అందేలా చర్యలూ తీసుకోవడంలేదు. అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ కింద రాష్ట్రంలో 108 అంబులెన్సులు 731 నడుస్తుండగా వీటిలో 3,500 మంది పనిచేస్తున్నారు. వీరితోపాటు 104, 102 సిబ్బంది సుమారు 6 వేల మంది ఉంటారు. వీరి వేతనాలకు సుమారు 100 కోట్ల రూపాయల వరకు అవసరం ఉంటుంది.
గతేడాది అక్టోబరు, నవంబరు, డిసెంబరు వేతనాలు చెల్లించకపోవడంతో వారు కుటుంబాలు నడపలేక ఇబ్బంది పడుతున్నారు. 108 అంబులెన్సుల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అరబిందో సంస్థకు అప్పగించింది. ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా కనీసం మూడు నెలలపాటు సదరు సంస్థ కార్యకలాపాల్లో సమస్యలు రాకుండా చూడాలి. ఈ నిబంధనతోనే మూడు నెలల వేతనాలు ఆగాయని తమకు ఆరు నెలల నుంచి చెల్లింపులు నిలిచాయని యాజమాన్యం చెబుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
104 సర్వీసుల్లో భాగమైన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో సుమారు 500మంది డ్రైవర్లు పని చేస్తున్నారు. వీరికి నెలకు చెల్లించేది 12 వేల రూపాయలు మాత్రమే. 102 కింద ఫ్యామిలీ ఫిజిషియన్ సేవల్లో సుమారు 1,900 మంది డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు. వీరిలో డ్రైవరుకు నెలకు 16వేల రూపాయలు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు 15 వేల రూపాయలు చొప్పున చెల్లిస్తు న్నారు. ఈ రెండు సర్వీసులు కూడా అరబిందో సంస్థ ద్వారానే కొనసాగుతున్నాయి. వీరందరికీ మూడు నెలలుగా వేతనాలు అందలేదు.
ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయంలో 108 సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హామీని అమలు చేయకపోవడంపై ఉద్యోగులు సమ్మె చేపట్టగా వారికి భరోసా ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఉద్యోగ భద్రత లభించలేదు. సెలవులు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాల విషయంలోనూ నష్టపోతున్నారు.