ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు సీఏఏపై దుష్ప్రచారం చేస్తున్నాయని.. అయినా పౌర చట్టాన్ని కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు భాజపా నేతలు. సీఏఏ అమలుతో దేశవ్యాప్తంగా 1.5 కోట్ల మంది లాభపడతారని పేర్కొన్నారు. మతపరమైన హింస కారణంగా దేశంలోకి ప్రవేశించిన శరణార్థులకు హక్కులు కల్పించడమే పార్టీ లక్ష్యమని పీటీఐ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో స్పష్టం చేశారు.
బంగాల్లో సీఏఏ..
బంగాల్లో భాజపా అధికారంలోకి వస్తే జాతీయ పౌర జాబితా(ఎన్ఆర్సీ) రూపొందిస్తుందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గీయ. అయితే రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు సీఏఏను అమలు చేసి తీరుతామన్నారు. దీని వల్ల బంగాల్లో 72 లక్షల మంది లబ్ధిపొందుతారని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ సీఏఏపై దుష్ప్రచారం చేస్తూ ఎందుకు అడ్డుకుంటుందో తెలియట్లేదన్నారు.
ఈసీపై మమత ఆరోపణలను తప్పుబట్టారు కైలాశ్.
"ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు మమతా బెనర్జీకి ఎన్నికల కమిషన్ మీద ఎలాంటి అనుమానాలు రాలేదు. కానీ ఇప్పుడు ఓటమిని చవిచూస్తామని భయంతో అనవసర ఆరోపణలు చేస్తున్నారు."
-విజయ్ వర్గీయ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి
అసోంలో..
ఎన్నికల్లో ప్రజల దృష్టిని మళ్లించేందుకు అసోంలో సీఏఏపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. ఇదంతా వారి కుట్రలో భాగమని, అయితే వారి ప్రయత్నాలేవీ సఫలం కాలేదని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తమకు హాని తలపెట్టేలా ఎలాంటి నిర్ణయం తీసుకోదని అసోం ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు అనురాగ్.
ఓట్ల కోసమే..
లౌకికవాదంపై తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ప్రధాని మోదీ ప్రతీకని అన్నారు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. ఓట్ల కోసమే కాంగ్రెస్ లౌకికవాదం పేరుతో ప్రచారం చేస్తోందని వ్యాఖ్యానించారు. భాజపాకు లౌకికవాదం రాజ్యాంగబద్ధమైన అంశం అని అన్నారు. ముస్లింలు కూడా ప్రధానికి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ఈవీఎంలపై దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు నఖ్వీ.
ఇదీ చదవండి : 'స్వచ్ఛ భారత్ 2.0'తో ప్లాస్టిక్ భూతానికి చెక్