NIA Arrests Chhota Shakeel Aides: అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టిపెట్టింది. తాజాగా ఆ గ్యాంగ్ నాయకుడు చోటా షకీల్ అనుచరులు ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిని ఆరీఫ్ అబుబకర్ షేక్, షబ్బీర్ అబూ బకర్‌షేక్‌లుగా గుర్తించారు. వీరిద్దరూ పశ్చిమ ముంబయి శివార్లలో డీ-కంపెనీకి చెందిన అసాంఘిక కార్యకలాపాలు, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేయడం వంటి పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సిండికేట్‌లో మొత్తం 21 మంది పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిని నేడు ఎన్ఐఏ కోర్టు ఎదుట ప్రవేశపెట్టనున్నారు. దీనిపై ఎన్‌ఐఏ అధికారి ఒకరు మాట్లాడుతూ ''ఎలక్ట్రానిక్ పరికరాలు, రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు, నగదు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. దీనికి సంబంధించిన పలువురికి సమన్లు జారీ చేస్తున్నాం.'' అని పేర్కొన్నారు. దావూద్‌కు చెందిన డీ-కంపెనీ హవాలా ఆపరేటర్లు, కీలక వ్యక్తులపై ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఉగ్ర కార్యకలాపాల ద్వారా భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ ముంబయి, ఇతర జిల్లాలు కలుపుకొని 29 చోట్ల దాడులు నిర్వహించింది.
సోమవారం ముంబయిలోని దాదాపు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. బాంద్రా, బోరివలి, గోరేగావ్, పరేల్, శాంటాక్రూజ్ తదితర ప్రాంతాల్లో దావూద్ కంపెనీకి చెందిన హవాలా ఆపరేటర్లు, డ్రగ్ స్మగ్లర్లు, రియల్ ఎస్టేట్ మేనేజర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఐఏ తనిఖీలు జరిపింది.
ఇవీ చూడండి: భారత్‌పై మళ్లీ దావూద్ గురి.. దేశవ్యాప్తంగా దాడులకు కుట్ర..