Margadarsi Chit Funds Case: మార్గదర్శిపై జగన్ ప్రభుత్వం మరో పెద్ద కుట్రకు పాల్పడింది. సక్రమంగా వాయిదాలు చెల్లించని, అర్హమైన ష్యూరిటీలు సమర్పించని చందాదారు ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులతో కేసు నమోదు చేయించింది. ఈ కేసులో ఫిర్యాదుదారైన ముష్టి శ్రీనివాస్.. చిట్ పాడుకున్నా ఆ ప్రైజ్‌మనీ పొందేందుకు చట్ట నిబంధనల ప్రకారం సమర్పించాల్సిన అర్హమైన ష్యూరిటీలు మార్గదర్శికి ఇవ్వలేదు. యూనియన్ బ్యాంకులో కుదువ పెట్టిన ఓ ఆస్తిని ష్యూరిటీగా చూపించారు. అంతేకాదు, ఆ బ్యాంకు నుంచి ఆయన తీసుకున్న రుణం కూడా పాత బకాయి-NPAగా ఉంది. అలాంటి ష్యూరిటీ ఆధారంగా అతనికి ఏ సంస్థ అయినా ప్రైజ్ మనీ ఎలా చెల్లిస్తుంది? ప్రైజ్ మనీ తీసుకున్న తర్వాత అతను నెలనెలా చందా సొమ్ము కట్టకపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? అలా చేస్తే సంస్థ మనుగడ సాధ్యపడుతుందా? ఆ చిట్ గ్రూపులోని మిగతా చందాదారుల ప్రయోజనాలు ఏం కావాలి? వారి ప్రయోజనాలు పరిరక్షించాల్సిన బాధ్యత మార్గదర్శి పైన ఉంటుంది కదా! కానీ మార్గదర్శిని వేధించటం, వ్యాపారాన్ని దెబ్బతీయటమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసే విజయవాడ నగర పోలీసులకు మాత్రం ఇవేవీ పట్టలేదు.
New Case on Margadarsi: అర్హమైన ష్యూరిటీలు సమర్పించని చందాదారు అలా ఫిర్యాదు ఇవ్వటమే తరువాయి.. అందులో నిజానిజాలేంటో పరిగణనలోకి తీసుకోకుండానే దాని ఆధారంగా విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసేశారు. ఆ వెనువెంటనే ఏదో ఉగ్రవాదిని పట్టుకుంటున్నట్లుగా లబ్బీపేట బ్రాంచి మార్గదర్శి మేనేజర్ బి. శ్రీనివాసరావు ఇంటికి మఫ్టీలో వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అసలు వచ్చినవాళ్ళు ఎవరు.. ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారనే కనీస సమాచారం ఇవ్వలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు మాత్రలు వేసుకునే అవకాశం సైతం ఇవ్వకుండా తమతో తీసుకెళ్లారు. ఆయనపట్ల దురుసుగా, దౌర్జన్యంగా వ్యవహరించారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో విజయవాడ సీపీ కాంతిరాణా టాటా విలేకర్ల సమావేశంలో చెప్పేవరకూ ఆయన్ను ఎవరు, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు.
ముష్టి శ్రీనివాస్ ఫిర్యాదు ఇవ్వగానే ఒక ఐజీ స్థాయి అధికారి ఏదో అంతర్జాతీయ కుట్రను ఛేదిస్తున్నంత స్థాయిలో ఫిర్యాదుదారుడిని పక్కన కూర్చోబెట్టుకుని మరీ ప్రెస్‌మీట్ పెట్టారు. అంతేకాదు, తొలుత ప్రెస్‌మీట్ ఉందని చెప్పి, ఆ తర్వాత లేదని.. రద్దయిందని మెసేజిలు పెడుతూ దోబూచులాడారు. ఈలోపు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయటం, వాంగ్మూలాలు నమోదు చేసుకోవటం, చిట్ రిజిస్ట్రార్కు లేఖ రాయటం.. ఇలా అన్నీ ఒకే రోజు గంటల వ్యవధిలో యుద్ధప్రాతిపదికన చేసేశారు. అంతా ముందస్తు ప్రణాళికతో ఉన్నట్లుగా వ్యవహరించారు. ఈ చిట్ గ్రూపులో మొత్తం 50 మంది సభ్యులు ఉండాల్సి ఉండగా, 30 మందే ఉన్నారని ప్రెస్‌మీట్‌లో విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా ఆరోపించారు. అది పూర్తి సత్యదూరమని మార్గదర్శి సంస్థ స్పష్టం చేసింది.
ముష్టి శ్రీనివాస్ విజయవాడ లబ్బీపేట మార్గదర్శి బ్రాంచిలో సీటీ20 వీపీ 3 నంబరు చిట్లో చేరారు. అది 50 లక్షల రూపాయల విలువైన చిట్. 2023 మార్చి 28న ఆయన చిట్ పాడుకున్నారు. మర్నాడే ఆయనకు ష్యూరిటీ దరఖాస్తుతో పాటు ఇంటిమేషన్ లెటర్‌ను కూడా మార్గదర్శి సంస్థ పోస్టులో పంపించింది. కానీ అతను మాత్రం ఆ ష్యూరిటీ దరఖాస్తు తిరిగి పంపలేదు. ఏప్రిల్ 11న మార్గదర్శి బ్రాంచి సిబ్బంది అతనికి రిమైండర్ పంపించారు. దానికీ స్పందన లేకపోవటంతో ఏప్రిల్ 27న మరోసారి అతనికి పోస్టు ద్వారా దరఖాస్తు పంపించారు. దానికి స్పందించిన ముష్టి శ్రీనివాస్ మే 13న లబ్బీపేట బ్రాంచికి వెళ్లి ఓ ఇంటిని ష్యూరిటీగా చూపనున్నట్లు పేర్కొంటూ మేనేజర్‌కు లేఖ సమర్పించారు. అయితే ఆ ఆస్తి యూనియన్ బ్యాంకు గవర్నర్‌పేట బ్రాంచ్‌లో కుదువ పెట్టి ఉండటంతో వేరే ఆస్తి పత్రాలు సమర్పించాలని లబ్బీపేట బ్రాంచి మేనేజర్ కోరగా.. ముష్టి శ్రీనివాస్ అవేవీ సమర్పించలేదు. మే 16న మరోసారి అతనికి రిమైండర్ పంపించినా స్పందన లేదు.
ఫ్యూచర్ లయబిలిటీ కింద ఆస్తిని మార్టిగేజ్ చేసేందుకు వీలుగా న్యాయసలహా తీసుకుని ఆస్తికి సంబంధించిన ఏయే పత్రాలు అవసరమో పేర్కొంటూ జూన్ 8న మరోసారి లేఖ పంపించారు. దీనికి ముష్టి శ్రీనివాస్ స్పందిస్తూ తన ఆస్తి విలువ 3 కోట్ల రూపాయలని, మార్గదర్శికి తానున్న ఫ్యూచర్ లయబిలిటీ 50 లక్షల రూపాయలేనని, అందుకే యూనియన్ బ్యాంకు నుంచి ఎన్వోసీ సమర్పిస్తానని సమాధానమిచ్చారు. దీంతో జూన్ 12న మార్గదర్శి ప్రతినిధి ఒకరు ముష్టి శ్రీనివాసరావు కార్యాలయానికి వెళ్లి, అతని నుంచి ష్యూరిటీ దరఖాస్తును తీసుకుని, తమ కార్పొరేట్ కార్యాలయానికి పంపించారు. ఆ ఆస్తి పత్రాలపై మార్గదర్శి కార్పొరేట్ కార్యాలయం న్యాయసలహా తీసుకోగా... ష్యూరిటీగా చూపించిన ఆస్తి NPA కింద ఉండటం, వన్ టైమ్ సెటిల్మెంట్ ఖరారు కాకపోవటంతో ఆ ఆస్తి కోర్టు కేసుల్లో పడే అవకాశం ఉందని.. అందుకే దాన్ని ష్యూరిటీగా తీసుకోవటం సరికాదని.. న్యాయవాది సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే చట్టప్రకారం ముష్టి శ్రీనివాస్ పాడుకున్న చిట్ మొత్తాన్ని మార్గదర్శి రెండో ఖాతాలోకి పంపించింది. ఆయన ష్యూరిటీలు సమర్పిస్తే ఆ ప్రైజ్ మనీని ఆయనకు చెల్లిస్తుంది. ఇక్కడ మార్గదర్శి పూర్తిగా చట్టప్రకారం, నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించింది. పోలీసులు మాత్రం కక్ష సాధింపుతో కేసు పెట్టారు.