భారత్‌లో 1990-2019 మధ్య అసాంక్రమిక, గాయాల సంబంధ నాడీ సమస్యలు (నాన్ కమ్యూనికబుల్ న్యూరాలజికల్ డిజార్డర్స్) రెట్టింపయినట్టు ఐసీఎంఆర్ అధ్యయనంలో తేలింది! ఈ అంశంపై ఐసీఎంఆర్, కేంద్ర వైద్యపరిశోధన సంస్థ, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఐహెచ్‌ఎంఈలు సంయుక్తంగా పరిశోధనపత్రం రూపొందించాయి. దీన్ని 'లాన్సెట్' పత్రిక బుధవారం ప్రచురించింది. ప్రజల వయసు పెరగడం సహా.. అధిక రక్తపోటు, వాయు కాలుష్యం, ఆహార లోపాలు, తీవ్ర మధుమేహం, స్థూలకాయం వంటివి ఈ నాడీ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణమని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో సంక్రమణ వ్యాధుల సమస్యలు అధికంగా ఉండగా, అసంక్రమణ వాధ్యులు మాత్రం అన్ని వయస్సుల వారిలో ఉన్నట్టు తేల్చారు.
- 2019లో పక్షవాతం కారణంగా 6.99 లక్షల మంది మరణించగా, మొత్తం మరణాల్లో దీని వాటా 7.4%. నాడీ సంబంధ సమస్యల్లో అసంక్రమణ వ్యాధులు 82.8%, సంక్రమణ వ్యాధులు 11.2%, గాయాల వాటా 6%.
- 2019లో వెలుగుచూసిన నాడీ సమస్యల్లో 37.9% కేసులకు పక్షవాతమే కారణం. తలనొప్పి 17.5%, మూర్ఛ 11.3%, సెరెబ్రల్ పాల్సీ 5.7, అల్జిమర్స్ 4.6%, సెంట్రల్ నెర్వస్ కేన్సర్ 2.2%, పార్కిన్సన్స్ 1.8%, మోటార్ నెర్వస్ డిసీజ్ 0.1%, ఇతర నాడీ సంబంధ సమస్యలు 1.3% మేర ఉన్నాయి. అంటువ్యాధుల్లో ఎన్సెఫిలిటిస్ 5.3%, మెనింజైటిస్ 4.8%, టెటనస్ 1.1% ఉన్నాయి.
- గాయాల్లో తలకు సంబంధించినవి 4.1%, వెన్నుపూసకు తగిలినవి 1.9% మేర ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. జీవితకాలంపై ప్రభావంచూపే వ్యాధుల్లో అసాంక్రమిక నాడీ సంబంధ సమస్యల వాటా 1990లో 4% ఉండగా, 2020 నాటికి అది 8.2 శాతానికి పెరిగింది. గాయాల కారణంగా తలెత్తే సమస్యల నిష్పత్తి 0.2% నుంచి 0.6%కి చేరింది. ఇదే సమయంలో అంటువ్యాధుల నిష్పత్తి 4.1% నుంచి 1.1%కి తగ్గింది.
ఇదీ చూడండి: 'మూడో దశ ఎప్పుడని చెప్పలేం.. సిద్ధంగా ఉండాలి'
ఇదీ చూడండి: కరోనా వేళ ఇలా ఉంటే ఆనందం!