NDA Meeting 2023 : ఐక్యత పేరుతో ప్రతిపక్షాలు సమావేశాలు నిర్వహిస్తున్న వేళ దిల్లీ వేదికగా తమ బలాన్ని ప్రదర్శించేందుకు బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) సిద్ధమైంది. మంగళవారం జరగనున్న ఎన్డీఏ సమావేశంలో ప్రస్తుతం కూటమిలో ఉన్న పార్టీలతో పాటు కొత్త భాగస్వామ్యులు కూడా హాజరుకానున్నారు. ఈ మేరకు గతంలో ఎన్డీఏ నుంచి వైదొలిగిన వారిని సైతం తిరిగి కూటమిలోకి తీసుకొచ్చేందుకు ఇటీవల బీజేపీ అనేక ప్రయత్నాలు చేసింది. దిల్లీలో జరగనున్న ఎన్డీఏ సమావేశం ద్వారా 2024 ఎన్నికల ప్రచారాన్ని కమలదళం ప్రారంభించనుందని సమాచారం. తనతో పాటు భాగస్వామ్య పార్టీలను తీసుకెళ్లడంలో బీజేపీ విఫలమవుతోందని విమర్శలు వినిపిస్తున్న వేళ దిల్లీలో జరగనున్న ఎన్డీఏ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి 38 పార్టీల నేతలు హాజరుకానున్నారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు.
"ప్రధాని మోదీ నాయకత్వంలో గత 9 ఏళ్లలో భారత్ ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్డీఏ ప్రజాసేవ కోసం పని చేస్తోంది. అధికారం కోసం కాదు. యూపీఏ పదేళ్ల పాలన అవినీతిమయం. అందుకే ప్రజలు బీజేపీకి మద్దతు తెలిపారు. ఇప్పుడు కూడా 2024లో మరోసారి మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వస్తుంది."
--జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు
అజిత్ పవార్ వర్గంతోనూ దోస్తీ..
బిహార్ సీఎం నేతృత్వంలోని జేడీయూ, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, అకాలీ దళ్ వంటి పార్టీలు బీజేపీతో విభేదించి ఎన్డీఏ నుంచి వైదొలిగాయి. అనంతరం ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేనను ఎన్డీఏ గొడుగు కిందకు తెచ్చిన కమలదళం, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో ఇటీవల జతకట్టింది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఎస్బీఎస్పీ నాయకుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్ సహా.. బిహార్ మాజీ సీఎం జితన్‌రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామీ మోర్చా సెక్యూలర్ పార్టీతోనూ చేతులు కలిపింది. ఉపేంద్ర కుశ్వాహా నేతృత్వంలోని ఆర్ఎల్ఎస్పీ కూడా ఎన్డీఏకే జై కొడుతోంది. ఈ సమావేశం నేపథ్యంలోనే లోక్ జనశక్తి (రామ్ విలాస్) నేత చిరాగ్ పాసవాన్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. మంగళవారం జరిగే ఎన్డీఏ పక్షాల సమావేశానికి చిరాగ్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు సంకేతాలు ఇచ్చాయి. కాసేపటికే.. ఎన్డీఏలో చేరాలని చిరాగ్ నిర్ణయించుకున్నారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. కూటమిలోకి ఆయన్ను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
ఎన్డీఏ తొలి సమావేశం!
తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎమ్‌కే నాయకులు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీలు, నాయకులను సైతం ఎన్డీఏ సమావేశానికి జేపీ నడ్డా ఆహ్వానించారు. ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇదే ఎన్డీఏ మొదటి సమావేశం. వచ్చే ఏడాది ఏప్రిల్-మే మధ్య జరుగుతాయని భావిస్తున్న లోక్‌సభ ఎన్నికలకు ఈ పార్టీలకు నాయకత్వం వహిస్తూ బీజేపీ మరోసారి అధికారం కోసం ప్రయత్నించనుంది. ఎన్డీఏ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీకి చెందిన సీనియర్ నేతలు హాజరుకానున్నారు.
ముచ్చటగా మూడోసారి..
ప్రాంతాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా చిన్నపార్టీలు, ప్రాంతీయ పార్టీలకు స్థానికంగా బలమైన ఓటు బ్యాంకు ఉంది. అత్యధిక లోక్‌సభ సీట్లు ఉన్న ఉత్తర్ ప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో రాజకీయ, సామాజిక సమతుల్యత కోసం ఆయా పార్టీల మద్దతు కీలకం కానుంది. ఈ పార్టీలతో కలిసి ముచ్చటగా మూడోసారి కూడా కేంద్రంలో అధికారం నిలుపుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే ఎన్డీఏ సమావేశాన్ని నిర్వహించనున్నారు.