NCP President Sharad Pawar : మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మనస్తాపానికి గురయ్యారా..? తన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారా..? కారణమేంటో తెలీదు. కానీ, పార్టీ జాతీయ స్థాయి సమావేశం నుంచి ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ మధ్యలోనే వెళ్లిపోయారు. పార్టీలో అగ్రనేతగా ఉంటూ కీలక సమావేశంలో మాట్లాడకుండా నిష్క్రమించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
దిల్లీలో జరిగిన జాతీయస్థాయి సమావేశంలో శరద్ పవార్ పార్టీ అధినేతగా ఏకగ్రీవంగా మరోసారి ఎన్నికయ్యారు. నాలుగు సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగుతారు. ఈ సమయంలో అజిత్ కంటే ముందుగా జయంత్ పాటిల్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. తర్వాత అజిత్ పవార్ వంతు వచ్చే సరికి ఆయన తన సీటు నుంచి లేచి వెళ్లిపోయారు. దాంతో ఆయనకు మద్దతుగా పార్టీ కార్యకర్తలు నినాదాలు చేయడం వల్ల.. ఆయన వెంటనే వస్తారని, వాష్‌రూంకు వెళ్లారని పార్టీ వెల్లడించింది.
ఈ సమయంలో తన సోదరుడిని ఒప్పించేందుకు పవార్ కుమార్తె సుప్రియా సూలే రంగంలోకి దిగారు. అజిత్‌ను ఒప్పించి వేదిక వద్దకు తీసుకువచ్చే సమయంలో.. శరద్ పవార్ సమావేశ ముగింపు ప్రసంగాన్ని ప్రారంభించారు. దాంతో ఆయనకు అసలు మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది. అయితే, అది జాతీయ స్థాయి సమావేశం కావడంతో తాను మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు అజిత్ చెప్పడం గమనార్హం. వేదికపైనే ఉన్న ఎన్‌సీపీ అధినేత ఈ పరిణామాలన్నింటిని నిశ్శబ్దంగా గమనించారు.
ఇదిలా ఉంటే.. 2019లో కూడా ఒకసారి అజిత్ పవార్ ఈ తరహాలో అలకను ప్రదర్శించారు. ఆ సమయంలో ఎన్‌సీపీ, కాంగ్రెస్, శివసేన కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్చలు జరిపే సమయంలో ఆయన అసంతృప్తికి గురయ్యారు. సరిగ్గా అప్పుడే భాజపాతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన మద్దతు ప్రకటించారు. దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అయితే, వారి ప్రభుత్వం 80 గంటలకే పడిపోయింది. అప్పుడు అంతా శరద్ పవార్‌కే మద్దతు ఇవ్వడంతో.. అజిత్ వెనక్కి రాక తప్పలేదు. తన సోదరుడిని వెనక్కి రప్పించే పనిని అప్పుడు కూడా సుప్రియనే తీసుకున్నారు.
ఇవీ చదవండి: జ్ఞానవాపి మసీదు వివాదంపై కోర్టు కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా 60 ప్రదేశాల్లో ఎన్‌ఐఏ దాడులు.. ఆ గ్యాంగ్‌స్టర్లే టార్గెట్!