ఉగ్రవాదులకు రూ.100 కోట్లు సమకూర్చే ముఠా గుట్టును ముంబయికి చెందిన మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు బహిర్గతం చేశారు. ఈ ముఠాకు చెందిన ఏడుగురిని అరెస్టు చేసిన అధికారులు.. వారి నుంచి 17 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్ముకశ్మీర్ నుంచి ముంబయికి ఈ మాదకద్రవ్యాల సరఫరా దందా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్ పెడ్లర్లు ద్విచక్రవాహనంపై వచ్చి మాదకద్రవ్యాలను బట్వాడా చేస్తున్నట్లు తేల్చారు. ముంబయిలో చాలా కాలంగా సాగుతున్న డ్రగ్స్ దందాకు చెక్ పెట్టేందుకు 'డార్క్‌నైట్' పేరుతో ఎన్‌సీబీ అధికారులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. జమ్ముకశ్మీర్ నుంచి ముంబయితోపాటు వివిధ ప్రాంతాలకు మాదకద్రవ్యాలు సరఫరా చేసే రాకెట్‌ను పట్టుకున్నారు. ఈ ముఠాకు టెర్రర్ ఫండింగ్‌తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించి అధికారులు కంగుతిన్నారు.
దావూద్ కంపెనీతో సంబంధాలు
ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న ఈ డ్రగ్స్ రాకెట్‌తో అండర్‌వరల్డ్ డాన్ దావూద్ కంపెనీకి కూడా సంబంధాలున్నట్లు ఎన్‌సీబీ దర్యాప్తులో వెల్లడైంది. రూ.100 కోట్ల డ్రగ్స్ సిండికేట్ సూత్రధారులు పాకిస్థాన్‌లో తిష్టవేసి.. వారి అనుచరుల ద్వారా కమీషన్ పద్ధతిలో మహారాష్ట్ర, దిల్లీ, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ సహా పలు ప్రాంతాల్లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు. దీనికోసం ఈ ముఠా సభ్యులు 'డి' కంపెనీతో ఉన్న సంబంధాలను వాడుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చిన డబ్బును దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. ఈ దందాతో వచ్చే డబ్బును హవాలా లేదా ఎన్‌జీఓల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు చేరవేస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలు కలిగిన పంజాబ్‌లోని ఇద్దరు డ్రగ్స్ డీలర్లను, ముంబయి, మహారాష్ట్రలో ఐదుగురు సప్లయర్లను ఎన్‌సీబీ అధికారులు పట్టుకున్నారు.
ఉగ్ర కార్యకలాపాలే లక్ష్యంగా పాకిస్థాన్‌లో తిష్ట
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలే లక్ష్యంగా పాకిస్థాన్‌లో తిష్టవేసిన కొందరు.. ఉగ్రవాదుల శిక్షణ కోసం నార్కో టెర్రరిజాన్ని ఊతంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులు మాదకద్రవ్యాల్ని బట్వాడా చేసేందుకు జమ్ముకశ్మీర్ నుంచి ముంబయికి వస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎన్‌సీబీ అధికారులు డార్క్‌నైట్ పేరుతో ఆపరేషన్ నిర్వహించారు. ఇద్దరు పెడ్లర్ల కోసం దాదర్‌లోని ఓ ధార్మిక కేంద్రం వద్ద మాటువేశారు. ఈ నెల 15న పంజాబ్‌కు చెందిన రాజ్విందర్‌సింగ్, గుర్మీత్‌సింగ్‌లు డ్రగ్స్ కన్సైన్‌మెంట్‌తో దాదర్‌లోని ధార్మిక కేంద్రానికి చేరుకున్నారు. అక్కడి లాంజ్‌లో అమిత్ ప్రకాశ్ పటేల్ అనే వ్యక్తిని కలిశారు. కాగా అక్కడే మాటువేసిన ఎన్‌సీబీ అధికారులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. డ్రగ్స్ ముఠా సభ్యుల నుంచి 2 కిలోల మాదకద్రవ్యాలు, రూ.2.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్ ద్వారా వారికి డ్రగ్స్ ఆర్డర్ వచ్చినట్లు.. దీంతో కశ్మీర్ వెళ్లి డ్రగ్స్ తీసుకొని ముంబయిలో బట్వాడా చేసేందుకు వచ్చినట్లు అరెస్టయిన వారిద్దరూ తెలిపారు.
మరిన్ని ప్రాంతాల్లో దాడులకు సిద్ధమైన అధికారులు
విచారణ సందర్భంగా మరో డ్రగ్స్ డీలర్ కమలేశ్ గుప్తా వివరాలు కూడా తెలిశాయి. కమలేశ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన ఎన్‌సీబీ అధికారులు అతడిచ్చిన సమాచారం మేరకు నూర్ మహమ్మద్ అనే మరో డ్రగ్స్ సప్లయర్ ఇంటిపై దాడి చేశారు. అక్కడి నుంచి 3 కిలోల మాదకద్రవ్యాలు, రూ. 2.2 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో టెర్రర్ ఫండింగ్, డ్రగ్స్ సరఫరా చేసేవారిని పట్టుకునే పనిలో దర్యాప్తు అధికారులు నిమగ్నమయ్యారు. డార్క్‌నైట్ ఆపరేషన్‌లో భాగంగా ఎన్‌సీబీ అధికారులు పంజాబ్, జమ్మూకశ్మీర్, ముంబయిలోని మరికొన్ని ప్రాంతాల్లో దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదీ చదవండి : భారత్‌ను ఆదుకుంటామని పాక్ సంస్థ భారీ మోసం