పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు(Punjab congress crisis) కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోమారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. దిల్లీలోని సోనియా నివాసానికి వెళ్లిన ఆయన.. ఆమెతో పాటు, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి-కాంగ్రెస్ పంజాబ్ వ్యవహారాల ఇన్‌ఛార్జీ హరీశ్ రావత్‌తోనూ చర్చించినట్లు తెలుస్తోంది.
పంజాబ్ కాంగ్రెస్ పునర్వ్యవస్థీకరణ, సిద్ధూకు కీలక పదవి దక్కనుందన్న ఊహాగానాల మధ్య అగ్రనేతలతో ఆయన భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది.
కలిసి ముందుకు...
రాష్ట్రంలో సిద్దూకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్ రావత్ ఖండించారు. వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు అమరీందర్ సింగ్, సిద్ధూ కలిసి పనిచేసేలా పార్టీ అధినాయకత్వం దిశానిర్దేశం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
"పంజాబ్ వ్యవహారాలపై నా నివేదిక సమర్పించేందుకు సోనియాను కలిశాను. సోనియా గాంధీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం వెలువడిన తర్వాత అందరికీ తెలియజేస్తా. నా మాటలు జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా."
- హరీశ్ రావత్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి.
గత కొద్ది రోజులుగా పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ , సిద్ధూ ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. అంతేగాక తమ అనుచరులతో చండీగఢ్‌లో సమావేశాలను సైతం నిర్వహించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్‌లో పరిస్థితులను చక్కబెట్టటం పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.
ఇదీ చూడండి: Amarinder vs Sidhu: రసవత్తరంగా పంజాబ్ రాజకీయం