కొవిడ్-19 వ్యాధి బాధితులు త్వరగా కోలుకునేందుకు వీలుకల్పించే 'బారిసిటినిబ్' ఔషధాన్ని నాట్కో ఫార్మా ఆవిష్కరించింది. దీనికి మనదేశంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడెస్కో) 'అత్యవసర అనుమతి' మంజూరు చేసింది. 1 ఎంజీ, 2 ఎంజీ, 4ఎంజీ ట్యాబ్లెట్లుగా ఈ ఔషధాన్ని విక్రయించటానికి అనుమతి లభించినట్లు నాట్కో ఫార్మా సోమవారం వెల్లడించింది. 'బారిసిటినిబ్' ఔషధాన్ని 'రెమ్‌డెసివిర్' కలిపి కాంబినేషన్ డ్రగ్‌గా ఉపయోగించినప్పుడు మెరుగైన ఫలితాలు వస్తాయని, కొవిడ్-19 రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని నాట్కో ఫార్మా పేర్కొంది. ప్రజారోగ్యానికి పెను ప్రమాదం ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో.. ఈ ఔషధానికి మనదేశంలో 'కంపల్సరీ లైసెన్స్' కోసం త్వరలో దరఖాస్తు చేయనున్నట్లు వెల్లడించింది. 'బారిసిటినిబ్'ను దేశవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా ఈ వారంలోనే విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: 'రెమ్‌డెసివిర్ అమ్మకాల్లో ఆ సంస్థల మాటేమిటి?'
ధర రూ.30...
ఈ ఔషధాన్ని ఎలి లిల్లీ అండ్ కంపెనీ అనే బహుళ జాతి ఔషధ సంస్థ 'ఓలుమియాంట్' అనే బ్రాండు పేరుతో ప్రపంచ విపణిలో విక్రయిస్తోంది. ఓలుమియాంట్ 4ఎంజీ డోసు 5 ట్యాబ్లెట్ల ప్యాక్ ధర మనదేశంలో రూ.17,000 వరకూ ఉంది. అంటే ఒక్కో ట్యాబ్లెట్ ధర దాదాపు రూ.3,400. కానీ నాట్కో ఫార్మా మాత్రం ఒక్కో ట్యాబ్లెట్‌ను రూ.30 ధరకు విక్రయించనుందని తెలిసింది. దీన్ని ఇప్పటి వరకూ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధిని అదుపు చేయటానికి వినియోగిస్తున్నారు. దీన్ని ఆస్పత్రుల్లో చేరిన కొవిడ్-19 బాధితులకు 'రెమ్‌డెసివిర్' ఔషధంతో కలిపి ఇవ్వటానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) గతేడాది నవంబరులో అత్యవసర అనుమతి ఇచ్చింది. రోగికి ఈ ఔషధంతో 14 రోజుల పాటు చికిత్స చేయాలని నిర్దేశించారు. కొవిడ్-19 రోగుల్లో ఎదురయ్యే 'సైటోకైన్ స్ట్రామ్' ను అదుపు చేయటంలో 'బారిసిటినిబ్' క్రియాశీలకంగా పనిచేస్తుందని పరిశోధనల్లో గుర్తించారు. అందువల్ల ఈ ఔషధాన్ని కొవిడ్-19 రోగుల కోసం 'రీ-పర్పస్' చేసి ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: 'లాక్డౌన్ కాదు.. అంతకుమించి ఆలోచించండి'
'కంపల్సరీ లైనెస్సింగ్' కోసం ప్రయత్నం..
కొవిడ్-19 కు సంబంధించి నాట్కో ఫార్మా నుంచి ఇది రెండో ఔషధం. గత నెలలో 'మోల్నుపిరవిర్' ఔషధానికి అత్యవసర అనుమతి కోసం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు నాట్కో ఫార్మా దరఖాస్తు చేసింది. దీనికి త్వరలో అనుమతి వస్తుందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా ఈ ఔషధాలకు 'కంపల్సరీ లైసెన్స్' సాధించేందుకు కూడా కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే పద్ధతిలో 2012లో బేయర్ కార్పొరేషన్‌కు చెందిన నెగ్జావర్(సొరాఫెనిబ్ టొసలైట్) అనే మూత్రపిండాల కేన్సర్ ఔషధానికి నాట్కో ఫార్మా మనదేశంలో 'కంపల్సరీ లైసెన్స్' పొందింది. ఇటువంటి అనుమతి పొందిన తొలి దేశీయ కంపెనీగా అప్పట్లో నాట్కో ఫార్మాకు గుర్తింపు వచ్చింది. 'నెగ్జావర్' 120 ట్యాబ్లెట్ల ప్యాక్‌ను అప్పట్లో బేయర్ కార్పొరేషన్ రూ.2.8 లక్షలకు విక్రయిస్తుండగా, నాట్కో ఫార్మా దాన్ని రూ.8,800 ధరకే అందుబాటులోకి తెచ్చింది. అదే పద్దతిలో ఇప్పుడు కూడా 'బారిసిటినిబ్' ట్యాబ్లెట్‌ను తక్కువ ధరకే అందించటం సహా.. దీనికి కూడా మనదేశంలో 'కంపల్సరీ లైసెన్స్' తీసుకోవాలని నాట్కో ఫార్మా భావిస్తోంది.
ఇదీ చదవండి: 'ఒక సిటీ స్కాన్.. 400 ఎక్స్‌రేలతో సమానం'