Namda Blankets Training : నమ్దా.. ఈ అందమైన రగ్గుల గురించి ఈ తరం కశ్మీరీల్లో చాలా మందికి తెలియదు. అందంతో పాటు నాణ్యతకు మారుపేరు అయిన సంప్రదాయ ఉన్ని రగ్గులను.. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేవారు. ముడిసరుకు నాణ్యత లేమి, కొత్తవారు ఎవరూ.. ఈ హస్తకళను నేర్చుకునేందుకు ఆసక్తి చూపించకపోవడం వల్ల వీటి తయారీ రెండు తరాలుగా క్షీణిస్తూ వచ్చింది. వీటికి మళ్లీ గుర్తింపు తెచ్చేందుకు కశ్మీర్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి వీటిని ఎలా తయారు చేయాలో ప్రభుత్వం నేర్పిస్తోంది.
"నామ్దా గురించి మాకు తెలియదు, మా తల్లిదండ్రుల తరానికి దానితో సంబంధం లేదు. అయితే మా పాత తరాలకు వీటితో విడదీయలేని బంధం ఉండేది. ఈ శిక్షణా కేంద్రాలు మా ప్రాంతానికి వచ్చినప్పుడు నాతో కలిసి 20 మంది అమ్మాయిలు ఇక్కడ పని చేయడం ప్రారంభించాం. ఇది మా ప్రాచీన సంప్రదాయం. దీన్ని సజీవంగా ఉంచాలనుకుంటున్నాము."
-అమీనా, కశ్మీర్ యువతి
11 శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి..
Namda Blankets Training Kashmir : ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో ఈ సంప్రదాయ హస్తకళకు పునరుజ్జీవం లభించినట్లు అయింది. కశ్మీర్ హస్తకళల విభాగం.. మొత్తం 11 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి నమ్దా రగ్గుల తయారీపై యువతకు శిక్షణ ఇస్తోంది.
"కశ్మీర్ వ్యాప్తంగా 11 ప్రదేశాల్లో నమ్దా శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. మేము యువ తరానికి నమ్దాను ఎలా తయారు చేయాలో నేర్పిస్తాము. నమ్దాను తయారు చేసేందుకు ఐఐటీ రూర్కీ యంత్రాన్ని రూపొందించింది. వీటి ద్వారా చేతులతో చేయాల్సిన పని తగ్గుతుంది. అందుకే ఐఐటీ రూర్కీని సంప్రదిస్తున్నాం."
-ఇమ్రాన్ అహ్మద్ షా, అధికారి
కళాకారులకు రుణాలు..
కశ్మీర్ ప్రభుత్వం ఆర్టిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం పరిధిలోకి నమ్దా తయారీని తీసుకొచ్చింది. దీని వల్ల కళాకారులు.. రుణాలు పొందే అవకాశం లభిస్తుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నమ్దాల ఉత్పత్తి పెంచేందుకు.. ముడిసరుకు బ్యాంకును ఏర్పాటు చేయడం సహా యంత్రాలను ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం సమీక్షిస్తోంది.
ఐరోపా, అమెరికా దేశాలకు..
Namda Blankets History : ఈ నమ్దాలు మన దేశంలో.. కశ్మీర్ ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యేవి. ఆ తర్వాత వీటిని ఐరోపా, అమెరికా, జపాన్ వంటి దేశాలకు.. ఎగుమతి చేసేవారు. అవి శీతల దేశాలు కాబట్టి.. నమ్దాలు ఎక్కువగా అవసరం అయ్యేవి. 1990 వరకు వీటి ఎగుమతి గణనీయంగా ఉండేది. కశ్మీరీ ఉత్పత్తులకు పేరు గాంచిన పష్మీనా శాలువాలు, తివాచీల కంటే వీటి ఆదాయం భారీగా ఉండేది.