కేరళలోని పాలక్కడ్‌కు చెందిన ఈయన ఖాసీం సాహెబ్. 35ఏళ్ల క్రితం కర్ణాటకలోని దక్షిణ కన్నడకు వలస వచ్చిన ఈయన జీవితంలో ఎన్నో కష్టాలను తట్టకుని.. చివరకు మంగళూరులోని ముల్కీ ప్రాంతంలో స్థిరపడ్డారు. కొత్త ప్రాంతానికి వచ్చినా కష్టాలు తగ్గకపోగా.. మరిన్ని సమస్యలు ఖాసీంను చుట్టుముట్టాయి. ఆ కష్టాల మధ్యే ఆ ప్రాంతంలోని వారు శివుడికి ప్రతిరూపంగా భావించే కొరగజ్జా దైవాన్ని తప్పక ప్రార్థిస్తారని తెలుసుకున్నారు. కొరగజ్జాను కొలిస్తే కష్టాలు తీరతాయని స్థానికులు ఒక సారి ఖాసీంకి చెప్పారు. అలా అప్పటి నుంచి కొరగజ్జా దైవాన్ని ఖాసీం ఆరాధించటం ప్రారంభించారు.
కొరగజ్జా దైవంపై ఉన్న భక్తితో తన ఇంటి సమీపంలోనే ఓ చిన్నపాటి ఆలయాన్ని నిర్మించారు. అక్కడ రోజూ పూజలు చేస్తూ... తన భక్తిశ్రద్ధలను చాటుకుంటూ వచ్చారు. తాను దేవుడి కోసం ఖాసీం పూర్తి శాకాహారిగా మారిపోయారు.
తాను నిర్మించిన ఆలయం వద్ద ప్రార్థనలు చేసేందుకు పలువురు ముస్లింలు కూడా వస్తుంటారని ఖాసీం సాహెబ్ అంటున్నారు. కొరగజ్జా దైవాన్ని ఆరాధించినప్పటి నుంచి తన జీవితంలో గొప్ప మార్పులు వచ్చినట్లు తెలిపారు.