Mumbai police: సుమారు రూ.17 లక్షలు విలువ చేసే బంగారం ఉన్న బ్యాగ్ పోయిందన్న ఫిర్యాదు అందిన కొన్ని గంటల వ్యవధిలోనే ముంబయి పోలీసులు కనుగొన్నారు. తెలంగాణకు చెందిన నాగమ్మ అనే మహిళ చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో తన కుటుంబంతో పాటు ముంబయికి వెళ్లారు. తనతో బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను కూడా తీసుకెళ్లారు. రైలు దిగిన తరువాత బ్యాగ్ మిస్ అయ్యిందని గుర్తించారు. దీంతో ఆమె వెంటనే ఈ విషయాన్ని సీఎస్‌ఎంటీ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే బ్యాగ్‌ను గుర్తించి ఆమెకు అందజేశారు.
ఇదీ జరిగింది...!
నాగమ్మ శివలింగి అనే మహిళ తన కుటుంబంతో కలిసి కృష్ణా రైల్వే స్టేషన్ నుంచి ముంబయికి చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో గురువారం బయలుదేరారు. శుక్రవారం ఉదయం ముంబయిలోని దాదర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రైలు దిగిన తరువాత తనతో తీసుకుని వెళ్లిన బ్యాగ్‌లు అన్నీ ఉన్నాయా లేదా అని లెక్క పెట్టుకున్నారు. ఒక్క బూడిద రంగు బ్యాగ్ మాత్రం కనిపించలేదు. రైలులోనే సీటు కింద మర్చిపోయినట్లు భావించారు. వెంటనే లోకల్ ట్రైన్లో సీఎస్‌ఎంటీ రైల్వే స్టేషన్‌కు చేరుకుని వారు వచ్చిన ఎస్ 4 బోగీని చూశారు. బ్యాగ్ కనిపించలేదు. ప్రయాణంలో తమ వెనుక కూర్చున్న వారు దొంగలించి ఉంటారని అనుకున్నారు. దీంతో ఆమె ఛత్రపతి శివాజీ మహారాజ్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఈశ్వర్ సుఖ్‌దేవ్ జాదవ్ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముందుగా చెన్నై ఎక్స్‌ప్రెస్‌ను తనిఖీ చేయాలని భావించారు. దీంతో రైలు శుభ్రం చేసేందుకు మజ్‌గావ్ యార్డ్‌కు వచ్చినట్లు గుర్తించిన అతను అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రైలు తలుపులు, కిటికీలు మూసివేశారు. దీంతో ఎమర్జెన్సీ విండో ద్వారా ఎస్ 4 బోగీలోకి ప్రవేశించి బ్యాగ్ కోసం సీటు కింద వెతికారు. చివరగా ఓ మూలన పడి ఉన్న బ్యాగ్ కనిపించింది. దానిని తీసుకుని బాధితులకు అప్పగించారు.
326 గ్రాముల బంగారం..
పోలీసులు వెతికి తెచ్చి ఇచ్చిన బ్యాగ్‌లో సుమారు 326 గ్రాముల బంగారం ఉన్నట్లు తెలిపారు. మొత్తంగా 5 బంగారు నెక్లెస్‌లు, 3 మంగళ సూత్రాలు, గోల్డ్ చైన్లు, 7 బ్రాస్లెట్లు, 5 బంగారు ఉంగరాలు, 6 జతల చెవికమ్మలు ఉన్నట్లు పేర్కొన్నారు. వాటి విలువ సుమారు 16 లక్షల 85 వేలు ఉంటుందని చెప్పారు. తమ బంగారాన్ని తిరిగి తెచ్చి ఇచ్చిన పోలీసులకు నాగమ్మ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చూడండి: కన్నవాళ్లు లేకున్నా సడలని సంకల్పం- 'డాక్టర్' కల సాకారం!