Mother Property Daughter Rights : తల్లి సంరక్షణను విస్మరించిన కుమార్తెకు ఆమె ఆస్తిపై హక్కులు ఉండవని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తల్లి ఆలనాపాలనా పట్టించుకోని ఓ కుమార్తె ఆస్తి రిజిస్ట్రేషన్ హక్కులను రద్దు చేస్తూ ఓ రెవెన్యూ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం సమర్థించింది.
ఇదీ జరిగింది..
తిరుపుర్ జిల్లా ఉడుమలైపేట్‌కు చెందిన రాజమ్మాళ్ తనకు చెందిన 3 ఎకరాల భూమిని కుమార్తె సుగుణకు పేరిట 2016లో రిజిస్ట్రేషన్ చేయించింది. అయితే ఆస్తి రిజిస్ట్రేషన్‌కు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. సుగుణ తనను సంరక్షించట్లేదని రాజమ్మాళ్ ఆరోపించింది. ఈ క్రమంలో సుగుణ తన ఆలనా పాలనా పట్టించుకోట్లేదని ఆస్తి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ఉడుమలైపేట్ రెవెన్యూ అధికారికి రాజమ్మాళ్ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రెవెన్యూ అధికారి దర్యాప్తు జరిపి.. సుగుణ ఆస్తి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సుగుణ.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
రాజమ్మాళ్ తన సంరక్షణ చూసుకుంటుందని తన కుమార్తె సుగుణకు ఆస్తి రాసిచ్చిందని విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టులో రెవెన్యూ అధికారి తెలిపారు. కానీ సుగుణ.. తన తల్లి రాజమ్మాళ్ను పట్టించుకోలేదని అందుకే ఆస్తి రిజిస్ట్రేషన్ హక్కులను రద్దు చేసినట్లు చెప్పారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ఎస్.ఎం. సుబ్రహ్మణ్యం.. రెవెన్యూ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. ఆ ఆధికారి తీసుకున్న ఉత్తర్వుల పట్ల కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
'భర్త ఆస్తిలో భార్యకు సమాన హక్కు'
Wife Rights In Husband Property : భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకు సమాన హక్కు ఉంటుందని ఇటీవలే.. మద్రాస్ హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా తెలిపింది. నైవేలి బొగ్గు గనిలో కన్నయన్ నాయుడు అనే వ్యక్తి అనేక ఏళ్ల పాటు పనిచేశాడు. ఆ సమయంలో అక్కడ నుంచి తన భార్యకు కుటుంబ పోషణ కోసం డబ్బులు పంపించాడు. కన్నయన్ భార్య.. ఆ డబ్బులతో కొంత విలువైన ఆస్తి కొనుగోలు చేసింది. అయితే ఆ ఆస్తిపై తనకు మాత్రమే హక్కు ఉందని.. భార్యకు లేదని అతడు కొన్ని రోజుల క్రితం.. దిగువ కోర్టులో పిటిషన్ వేశాడు. పిటిషన్ స్వీకరించిన దిగువ కోర్టు విచారణ జరిపింది. కన్నయన్ నాయుడి ఆస్తిలో అతడితోపాటు భార్యకు కూడా సమాన హక్కు ఉందని తీర్పునిచ్చింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.