Mother Fights With Jackal: కన్న కొడుకును రక్షించుకునే క్రమంలో ఓ మహిళ గొప్ప ధైర్యసాహసాలు ప్రదర్శించింది. నక్కతో పోరాడి కన్న బిడ్డను(5) కాపాడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో జరిగింది.
జిల్లాలోని తకుర్పుర గ్రామం మాధవ్ నేషనల్ పార్క్‌కు సమీపంలో ఉంది. పార్క్‌లోని క్రూర మృగాలు తరచూ జనావాసాలపై దాడి చేస్తుంటాయి. తాజాగా తకుర్పుర గ్రామంలోకి దారి తప్పి వచ్చింది ఓ నక్క. ఆరుబయట ఆడుకుంటున్న ఓ బాలుడిపై దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన బాలుడి తల్లి.. నక్కపై రాళ్లతో దాడి చేసింది. దీంతో పిల్లాడిని వదిలిపెట్టి అడవిలోకి పరుగులు పెట్టింది నక్క. గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.
సింహంతో పోరాడి..
Forest Guard Fight With Tiger: మరో ఘటనలో మధ్యప్రదేశ్‌లో ఓ ఫారెస్ట్ గార్డ్ సింహంతో పోరాడి ప్రాణాలు రక్షించుకున్నారు. సాత్పురా టైగర్ రిజర్వ్‌లో సుధ ఫారెస్ట్ గార్డ్‌లా పనిచేస్తున్నారు. ఈ సమయంలో దారి తప్పిన ఓ సింహం ఆమెపై దాడి చేసింది. ఆ క్రమంలో సింహంతో పోరాడింది సుధ. చివరకు సహచర ఫారెస్ట్ గార్డ్లు వచ్చి ఆమెను కాపాడారు.
ఈమె ప్రదర్శించిన తెగువ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. సినీ నటి విద్యాబాలన్ కూడా అప్పట్లో ఈ మహిళను ప్రశంసించిన ట్వీట్ తెగ వైరల్ అయింది.
చిరుతను వెంబడించి..
Mother Rescued Her Son From Leopard: ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఓ తల్లి ప్రదర్శించిన ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రసంశలు అందుకున్నాయి. కుమారుడిని నోటితో కరుచుకుపోతున్న చిరుతతో పోరాడి బిడ్డను రక్షించుకుంది బైగా తెగకు చెందిన కిరణ్ అనే మహిళ. సిద్ధి జిల్లాలోని బరిజహారియా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
తన ఇంటి వద్ద పిల్లలతో కలిసి చలిమంట కాచుకుంటోంది కిరణ్. ఓ బిడ్డ ఆమె ఒడిలో కూర్చోగా మరో ఇద్దరు పక్కనే ఉన్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన చిరుత ఓ పిల్లాడిని నోట కరుచుకుని అడవిలోకి పరుగులు పెట్టింది. వెంటనే దానిని వెంబడించింది కిరణ్. కిలోమీటరు దూరంలో చిరుతను గుర్తించింది. చిరుతతో పోరాడి కుమారుడిని రక్షించింది.
తల్లీబిడ్డలపై చిరుత దాడి చేస్తుండగా.. అంతలోనే గ్రామస్థులు వచ్చి దానిని పారదోలారు. గాయపడిన తల్లీబిడ్డలను ఆసుపత్రిలో చేర్పించారు. వారు క్షేమంగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: