Monkey Kills Dog: మహారాష్ట్ర బీడ్ జిల్లా మజల్‌గావ్ తాలూకాలోని లావుల్ గ్రామంలో ఓ వింతైన ఘటన జరిగింది. ఆ గ్రామంలో కుక్కపిల్లల్ని కోతులు చంపేస్తున్నాయి. శునకాల కూనలను ఎత్తుకునిపోయి ఎత్తైన ప్రదేశాల నుంచి తోసేస్తున్నాయి. ఇప్పటివరకు 300 కుక్కపిల్లల్ని చంపేశాయని గ్రామస్థులు చెబుతున్నారు. కేవలం గత నెలరోజుల్లో 125కు పైగా కూనలను చంపాయని చెప్పారు.
Dog vs Monkey Fight to Death:
లావుల్ గ్రామం మజల్‌గావ్ నుంచి 10 కి.మీల దూరంలో ఉంది. ఇక్కడి జనాభా దాదాపు ఐదు వేల మంది. గత ఒకటిన్నర నెలల నుంచి ఓ మూడు కోతులు గ్రామ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నాయి. ఈ కోతులు.. గ్రామంలోని కుక్కపిల్లలను ఎత్తుకుని వెళ్లి ఎత్తైన చెట్లు లేదా ఇంటి పైకప్పు నుంచి నెట్టేస్తున్నాయి. దీంతో కుక్కపిల్లలు అక్కడికక్కడే మృత్యువాత పడుతున్నాయి. శునకాలను రక్షించే ప్రయత్నంలో కొందరు స్థానికులు గాయపడిన సందర్భాలూ ఉన్నాయి.
" 15 రోజుల క్రితం మా కుక్క పిల్లను కోతులు ఎత్తుకొని వెళుతున్న క్రమంలో నేను వారించే ప్రయత్నం చేశా. దీంతో అవి నాపై దాడికి యత్నించాయి. తప్పించుకునే ప్రయత్నంలో ఇంటి పైకప్పు నుంచి పడిపోయాను. నా కాలు విరిగిపోయింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను."
- సీతారాం నైబాల్, స్థానికుడు
Monkey Revenge News:
'సుమారు రెండున్నర నెలల క్రితం ఇదే గ్రామానికి చెందిన ఓ కోతి పిల్లను ఓ కుక్క చంపేసింది. దీంతో కుక్కలపై పగ పెంచుకున్న కోతులు వాటి పిల్లలను చంపేస్తున్నాయి' అని గ్రామస్థులు చెబుతున్నారు.
కేవలం కుక్కపిల్లల వెంట్రుకల్లో ఉండే పురుగులను తిని ఆ తర్వాత వాటిని ఎత్తైన ప్రదేశం నుంచి విడిచిపెడుతున్నాయని జంతు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీంతో కుక్కపిల్లలు చనిపోతున్నాయని అంటున్నారు. కోతులు తమ పనికి ఆటంకం కలిగిస్తున్న మనుషులపై కూడా దాడి చేస్తాయని పేర్కొన్నారు.
కోతుల పట్టివేత..
కుక్కపిల్లల మృతికి కారణమైన రెండు కోతుల్ని నాగ్‌పుర్ అటవీ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వాటిని బీడ్ జిల్లా నుంచి నాగ్‌పుర్‌కు తరలించారు. సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టనున్నట్లు బీడ్ అటవీ అధికారి సచిన్ కంద్ తెలిపారు.
ఇదీ చదవండి: కాసేపట్లో పెళ్లి.. వరుడ్ని చితకబాదిన వధువు కుటుంబం