బంగాల్లో ఎన్నికల సంగ్రామం కొనసాగుతున్న వేళ.. ఓ క్లబ్‌హౌస్‌లో పాత్రికేయులతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జరిపిన సంభాషణల ఆడియో కలకలం రేపుతోంది. బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తరఫున ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఆయన.. భాజపాకు అనుకూలంగా వ్యాఖ్యానిస్తున్నట్టు అందులో ఉంది. టీఎంసీ ఎదుర్కొంటున్న అధికార దుర్వినియోగం ఆరోపణలు భాజపాను అధికారంలోకి తీసుకువస్తాయని వ్యాఖ్యానించారు.
ఆ ఆడియోను భాజపా ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా విడుదల చేశారు.
అధికార పార్టీని రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ప్రశాంత్ కిశోర్ మాట్లాడటం ఈ ఆడియోలో వినిపించింది. క్షేత్రస్థాయిలో భాజపా కార్యకర్తలు బలంగా ఉన్నారన్న ఆయన.. రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ప్రచార సభలకు జనం భారీగా తరలివస్తున్నారని చెప్పారు. మతువా సామాజిక వర్గంలో చాలా మంది భాజపాకే ఓటు వేస్తారని చెప్పారు.
"మోదీకి ఉన్న జనాకర్షణ, హిందూ అంశం, హిందీ మాట్లాడేవారు.. తదితర కారణాల వల్ల మోదీ ప్రజాదరణ సాధించారు. రాష్ట్రంలో 27 శాతం మంది దళితులు ఉన్నారు. వారంతా భాజపాతోనే ఉంటారు. బంగాల్లో ఎవరు అధికారంలోకి వస్తారని మేం నిర్వహించిన సర్వేలో భాజపానే అధికారాన్ని చేపడుతుందని చాలా మంది చెప్పారు. వామపక్షాలకు మద్దతు అందించే ఓటర్లు కూడా భాజపానే గెలుస్తుందని చెబుతున్నారు. ఒకటి లేదా రెండు జిల్లాలను మినహాయిస్తే.. భాజపాకు కేడర్ లేని జిల్లానే లేదు."
- ప్రశాంత్ కిశోర్, ఎన్నికల వ్యూహకర్త
మార్పు కోరుకుంటున్నారు..
ప్రధాని మోదీపై అధికార వ్యతిరేకత ఏ మాత్రం లేదని ప్రశాంత్ కిశోర్ అన్నారు. తాము నిర్వహించిన సర్వేల్లో బంగాల్లో మోదీకి, మహాత్మా గాంధీకి సమానమైన ఆదరణ ఉందని తేలిందని చెప్పారు. బంగాలీలు మార్పును కోరుకుంటున్నారని ప్రశాంత్ కిశోర్ చెప్పారు.
బంగాల్ ప్రజలు ఇప్పటివరకు భాజపా పాలనను రుచి చూడలేదు. అందుకే ఈసారి భాజపావైపు మొగ్గు చూపాలనుకుంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. మైనార్టీలను ప్రసన్నం చేసుకోవడానికి రాష్ట్రంలో 20 ఏళ్లుగా పాలన కొనసాగడం అనేది ఆ పార్టీకి మరో సానుకూలత. ముస్లింల మద్దతు ఇచ్చే ఒక పార్టీ సాయంతో భాజపా అధికారాన్ని చేపట్టేందుకు మార్గం సుగమం అవుతుంది. మొదటిసారి హిందూ ఓటర్లు తమ కోసం ఆలోచించేవారు ఉన్నారని భావిస్తున్నారు. మైనార్టీ రాజకీయాలను టీఎంసీ, కాంగ్రెస్, వామపక్షాలు నిర్లక్ష్యం చేయటం భాజపాకు కలిసి వచ్చే అంశం.
- ప్రశాంత్ కిశోర్, ఎన్నికల వ్యూహకర్త
'100 కూడా రావు'
అనంతరం దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు ప్రశాంత్ కిశోర్. సొంత పార్టీ నేతల కంటే.. తన మాటల గురించే భాజపా తీవ్రంగా ఆలోచిస్తోందని అన్నారు. ధైర్యం ఉంటే తన ఆడియోను పూర్తిగా విడుదల చేయాలని అన్నారు.
"తమ సొంత నేతల కంటే నా మాటల గురించే భాజపా తీవ్రంగా ఆలోచించటం సంతోషంగా ఉంది. వారికి ధైర్యం ఉంటే ఆ సంభాషణలను మొత్తాన్ని బహిరంగ పర్చాలి. దానిలోని తమకు అనుకూలంగా ఉండే ముక్కలను కత్తిరించి పెట్టడం కాదు. నేను ఇది వరకే చెప్పాను. మళ్లీ చెప్తున్నా.. బంగాల్లో భాజపా వంద సీట్లు కూడా దాటదు."
- ప్రశాంత్ కిశోర్, ఎన్నికల వ్యూహకర్త
బంగాల్ శాసనసభ ఎన్నికల్లో భాజపాకు 99 కన్నా ఎక్కువ స్థానాలు రావడం గగనమని నాలుగు నెలల క్రితం ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి:'దీదీ.. హింసతో భాజపా విజయాన్ని అడ్డుకోలేరు'