Modi Global Leader Rating : ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదంగల నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి నిలిచారు. దేశంలో మోదీ నాయకత్వాన్ని 76 శాతం ప్రజలు సమర్థిస్తున్నారు. 18 శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మోదీ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రేడర్ ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని మెక్సికోలో 66 శాతం మంది ప్రజలు ఆమోదిస్తుండగా, 29 శాతం మంది వ్యతిరేకిస్తున్నట్లు సర్వేలో పేర్కొంది. జనామోదం విషయంలో రెండో స్థానంలో ఉన్న లోపెజ్కు, మోదీకి మధ్య 10 శాతం తేడా ఉండటం విశేషం. ప్రధాని మోదీ అగ్రస్థానంలో ఉండటంపై పలువురు బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
అంతకుముందు సర్వేల్లో కూడా ప్రజామోదంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రథమ స్థానంలో ఉన్నారు. గతేడాది మార్నింగ్ కన్సల్ట్ సంస్థ విడుదల చేసిన సర్వేలో మోదీని 71 శాతం మంది ప్రజలు ఆమోదించారు. ఆ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల అధినేతలపై మార్నింగ్ కన్సల్ట్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో మోదీ 71 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, అప్పుడు కూడా మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ 66 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. ఇటలీ అధ్యక్షుడు మారియో డ్రాగీ 60 శాతంతో మూడో స్థానాన్ని సంపాదించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనెడా ప్రధాన మంత్రి జస్టిస్ ట్రూడోలకు 43 శాతం ప్రజామోదం లభించింది. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ 2020 మే నెలలో వెల్లడించిన సర్వేలో మోదీకి 84 శాతం ప్రజామోదం లభించింది. ఆ తర్వాత కరోనా రెండో దశ విజృంభణ సమయంలో మాత్రం ఇది 63 శాతానికి పడిపోయింది.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరవేసింది. ఇది 2024 జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు మరింత జోష్‌ను నింపనున్నాయి.
ఎంపీ మళ్లీ బీజేపీదే- పేద మహిళల అండ, మామా-మోదీ కరిష్మాతో ఘన విజయం