Modi Third Time PM : దేశానికి మూడోసారీ ప్రధాని నరేంద్ర మోదీనే నాయకత్వం వహిస్తారని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వార్తాసంస్థ ది గార్డియన్ అంచనా వేసింది. ఉద్వేగభరితమైన రామ మందిరం అంశం ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో ప్రధాని మోదీకి కలసివస్తుందని స్పష్టం చేసింది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం, మోదీకి ఉన్న అపారమైన ప్రజాదరణ ఆయనను మరోసారి ప్రధాని పీఠం ఎక్కిస్తాయని తెలిపింది. భారత రాజకీయ విశ్లేషకులంతా ఇదే నమ్ముతున్నారని వివరించింది.
'హిందూ జాతీయవాదం వారిని ఆకర్షిస్తూనే ఉంది'
బీజేపీ హిందూ జాతీయవాద ఎజెండా దేశంలోని హిందూవర్గాన్ని, ముఖ్యంగా ఉత్తర భారత ప్రజలను ఆకర్షిస్తూనే ఉందని ది గార్డియన్ తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో కమల దళానికి ప్రాంతీయ వ్యతిరేకత బలంగా ఉన్నప్పటికీ కేంద్ర స్థాయిలో విపక్షాలు బలహీనంగా ఉన్నాయని పేర్కొంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అంతర్గత పోరుతో నిండిపోయిందని తెలిపింది. తెలంగాణలో ఇటీవలే విజయం సాధించినా, దేశంలో మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉందని చెప్పింది.
'ఇండియా కూటమిలో ఏకాభిప్రాయం లేదు'
విపక్షాలు అన్ని కలిపి ఇండియా కూటమిని ఏర్పాటు చేసినప్పటికీ కీలకాంశాల్లో ఆయా పార్టీల్లో ఏకాభిప్రాయం లేదని చెప్పింది. బీజేపీతో సమష్టిగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేసినా పార్టీల మధ్య పొంతన కుదరట్లేదని చెప్పింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల మాదిరిగా బీజేపీ భారీ మెజారిటీ సాధిస్తుందా లేదా అని చెప్పలేమని తెలిపింది. ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేస్తాయని అంచనా వేసింది.
ఓటర్లను విపరీతంగా ఆకర్షించిన మోదీ
"రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అఖండ విజయాలు ప్రధాని మోదీ ప్రజాదరణను మళ్లీ చాటి చెప్పాయి. స్థానిక అసెంబ్లీ ఎన్నికలు అయినప్పటికీ మోదీయే స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను విపరీతంగా ఆకర్షించారు. ర్యాలీల్లో పాల్గొన్నారు. తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ ఇది మోదీ గ్యారంటీ అంటూ చెప్పారు. అది బీజేపీకి బాగా కలిసొచ్చింది" అని గార్డియన్ వివరించింది. ప్రపంచ శక్తిగా భారత్ ఎదగడంలో, అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ పాత్ర మెరుగవ్వడంలో ప్రధాని మోదీ కీలకపాత్ర పోషించారని ప్రశంసించింది.