వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు కొనసాగుతున్న వేళ హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 17 జిల్లాల్లో జనవరి 30 వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే పాల్వాల్, సోనిపట్, ఝజ్జర్‌లలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వం.. తాజాగా మరో 14 జిల్లాల్లో ఇదే తరహా చర్యలు చేపట్టింది. మూడు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు ఆందోళనలకు మద్దతుగా ఘాజీపూర్, టిక్రీ, సింఘూ సరిహద్దుల ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల వేదికగా దుష్ప్రచారం, పుకార్లను కట్టడి చేసేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు రాష్ట్ర హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాజీవ్ అరోరా తెలిపారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరగకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు.
ఇదీ చదవండి : సింఘు వద్ద ఉద్రిక్తత- పోలీస్ అధికారిపై దాడి