ఫాదర్స్ డే సందర్భంగా.. మిజోరం క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రొమావియా ఆసక్తికర ప్రకటన చేశారు. తన నియోజకవర్గం ఐజ్వాల్ తూర్పు-2 పరిధిలో అత్యధిక సంతానం ఉన్న తల్లి లేదా తండ్రికి రూ. లక్ష నగదు ప్రోత్సాహకం అందిస్తానని వెల్లడించారు. నగదు బహుమతితో పాటు ట్రోఫీ కూడా అందజేస్తానని తెలిపారు. మిజో తెగల్లో జనాభాను పెంచేందుకు తాను ఈ ఆఫర్ ప్రకటించినట్లు వెల్లడించారు. అయితే అత్యధిక సంతానం అంటే ఎంతమంది పిల్లలు అనేది మాత్రం మంత్రి స్పష్టంగా చెప్పలేదు.
"మిజో వర్గంలో జనాభా తగ్గుదల ఆందోళనకరంగా మారుతోంది. కొన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ఈ జనాభా సరిపోవడం లేదు. మిజో లాంటి గిరిజన తెగలకు ఇది సమస్యగా తయారవుతోంది. అందుకే ఈ తెగల్లో జనాభాను పెంచేందుకు ఈ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించాం" అని రాబర్ట్ రొమావియా చెప్పుకొచ్చారు. ఇందుకయ్యే ఖర్చును రాబర్ట్ కుమారుడికి చెందిన నిర్మాణ కన్సల్టెన్సీ సంస్థ భరించనున్నట్లు తెలుస్తోంది. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం మిజోరం జనాభా 10,91,014. దేశంలో అత్యంత తక్కువ జనసాంద్రత కలిగిన రెండో రాష్ట్రం మిజోరం.
అయితే మిజోరంకు పొరుగునే ఉన్న అస్సాం రాష్ట్రంలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో జనాభాను నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి అస్సాంలో ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నవారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించింది. పంచాయతీ ఎన్నికల్లోనూ 'ఇద్దరు సంతానం' నిబంధన అమలు చేస్తోంది.
ఇదీ చూడండి: ఆటోడ్రైవర్లకు ఉచిత పెట్రోల్.. ఎక్కడంటే?