Mizoram Election 2023 Counting Postponed : ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ను భారత ఎన్నికల సంఘం ఒకరోజు వాయిదా వేసింది. డిసెంబర్ 3వ తేదీకి బదులు డిసెంబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు వెల్లడించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
"మిజోరం ప్రజలకు ఆదివారం ప్రత్యేకమైన రోజు. అందుకే కౌంటింగ్ తేదీ మార్చాలని వివిధ వర్గాల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకుని డిసెంబర్ 4వ తేదీకి కౌంటింగ్‌ను వాయిదా వేశాం. మిగతా నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ యథావిథిగా జరగనుంది" అని ఎన్నికల సంఘం తెలిపింది.
మిజోరంలో ఎవరో?
మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న మిజోరంలో త్రిముఖ పోరు నెలకొంది. మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), కాంగ్రెస్, జోరం పీపుల్స్ మూమెంట్ (ZPM) మధ్యే ప్రధాన పోటీ. బీజేపీ సైతం పోటీలో ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎంఎన్‌ఎఫ్‌కు, జడ్‌పీఎంకు మధ్య గట్టిపోటీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజపా ప్రభావం నామమాత్రమే. కాంగ్రెస్ కొన్నిసీట్లలో ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. బీజేపీకు ఒకటీ, రెండు కూడా కష్టమే.
మిజోరంలో ఒకే విడతలో నవంబర్ 7వ తేదీన ఎన్నికలు జరిగాయి. 11 జిల్లాల వ్యాప్తంగా 40 స్థానాల్లో ఆరోజు సాయంత్రం 5గంటల వరకు 77.04శాతం పోలింగ్ నమోదైంది. సెర్చిప్ జిల్లాలో రికార్డు స్థాయిలో 83.96శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి లియాంజలా వెల్లడించారు.
అయితే క్రిస్టియన్లు అధిక సంఖ్యాకులుగా ఉన్న మిజోరంలో పొరుగు రాష్ట్రం మణిపుర్ పరిస్థితులు ప్రభావం చూపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, వాటిని అధికార ఎంఎన్‌ఎఫ్ తనకు ఎంతమేర అనుకూలంగా మార్చుకుంటుందో చూడాలి. మరి మిజోరం ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తెలుసుకోవాలంటే డిసెంబర్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే!