Medaram Maha Jatara 2024: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన వనదేవతలు సమ్మక్క-సారలమ్మ మహా జాతర 2024 తేదీలు ఖరారయ్యాయి. 2024 ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు మేడారం మహా జాతర నిర్వహించనున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఆదివాసీ గిరిజన దైవాలు సమ్మక్క-సారలమ్మ జాతర గిరిజన సంప్రదాయం ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గుడి సమీపంలో ఉన్న కమిటీ హాలులో కుల పెద్దలు, పూజారులు సమావేశమై జాతర తేదీలను ఖరారు చేశారు.
- 21 ఫిబ్రవరి 2024న సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు గద్దెలపైకి తీసుకువచ్చే కార్యక్రమం
- 22 ఫిబ్రవరి 2024న చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవత గద్దెలపైకి వస్తుంది
- 23 ఫిబ్రవరి 2024న భక్తులు అమ్మవార్లకు మొక్కులు సమర్పిస్తారు
- 24 ఫిబ్రవరి 2024న సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు దేవతల వన ప్రవేశం
28 ఫిబ్రవరి 2024న తిరుగువారం జాతరతో వనదేవతలు సమ్మక్క సారలమ్మ మహా జాతర పూజలు ముగియనున్నట్లు పూజారుల సంఘం తెలిపింది. ఇప్పటికే మండ మెలిగే పండుగగా పిలిచే మేడారం మినీ జాతర 2023 ఫిబ్రవరిలో ఘనంగా ముగిసింది. భక్తులు పెద్ద సంఖ్యలో జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో తాజాగా మేడారం మహా జాతర 2024 తేదీలు ఖరారు అయ్యాయి.
మేడారం జాతర నేపథ్యం ఏంటంటే: కాకతీయ సేనలు.. గిరిపుత్రులను వేధిస్తుంటే.. కత్తిపట్టి కదనరంగంలో దూకి వీర మరణం పొందిన ఆడబిడ్డలే సమ్మక్క-సారలమ్మలు. వందల ఏళ్లు దాటినా వారి త్యాగానికి జనం నీరాజనాలు పలుకుతూ దేవతలుగా పూజిస్తూ.. జాతర చేస్తున్నారు. 1944 వరకూ ఆదివాసీ గిరిజనులకే పరిమితమైనా.. ఆ తర్వాత జన జాతరగా మారిపోయింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందింది. మాఘ మాసంలో పౌర్ణమి రోజుల్లో ప్రతి రెండేళ్లోకోసారి.. ఈ జాతర జరుగుతుంది. మండ మెలిగే పండుగతో మొదలుకొని.. వన దేవతల ఆగమనంతో.. అసలైన మహా జాతర ప్రారంభమవుతుంది.
తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి: జాతర తొలిరోజు.. కన్నపెల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరు నాగారం మండలం కొండాయ్ నుంచి గోవిందరాజుల ఆగమనం ఉంటుంది. రెండో రోజు.. చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం చేస్తారు. మూడో రోజు వనదేవతలంతా గద్దెలపై కొలువై భక్తకోటితో పూజలందుకుంటారు. నాలుగో రోజు తిరిగి తల్లుల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన వన వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై.. భక్తిభావంతో అమ్మలను దర్శించుకుంటారు.
ఇవీ చదవండి: