ఆక్సిజన్ సరఫరా కోసం మ్యాక్స్ హాస్పిటల్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దిల్లీలోని తమ ఆస్పత్రికి అత్యవసరంగా ఆక్సిజన్ సరఫరా చేసేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. ఆక్సిజన్ నిల్వలు 3 గంటలకు మించి లేనందున ఆక్సిజన్ అందించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని విన్నవించింది. ఈ పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్ సరఫరా నిలిపివేయాలని కేంద్రానికి సూచించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో స్టీల్, పెట్రోలియం పరిశ్రమలకు ఆక్సిజన్ అందించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు మేల్కోవడం లేదని ఈ సందర్భంగా కేంద్రాన్ని దిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఆక్సిజన్ కొరతపై నిన్ననే ఆదేశాలు ఇచ్చినా పాటించలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎలా విస్మరిస్తున్నారని ప్రశ్నించింది. వెంటనే మ్యాక్స్ ఆస్పత్రికి ఆక్సిజన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఆక్సిజన్ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని తెలిపింది. అవసరమైతే స్టీల్, పెట్రోలియం పరిశ్రమల నుంచి ఆక్సిజన్‌ను ఆస్పత్రులకు తరలించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచాలని ఉక్కు పరిశ్రమలను దిల్లీ హైకోర్టు ఆదేశించింది.
ఇదీ చదవండి : 'మహా' విలయం- ఒక్కరోజే 67,468 మందికి కరోనా